ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ మరోసారి పొడిగించిన ఏపీ సర్కార్
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:55 PM
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ను 2026 సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను మరోసారి పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) జీ.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 4 వరకు సస్పెన్షన్ కొనసాగింపు
తాజా ఉత్తర్వుల ప్రకారం.. విశాల్ గున్ని సస్పెన్షన్‌ను 2026 సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లేదా సెప్టెంబర్ 4వ తేదీ వరకు (ఏది ముందైతే అది) ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్: 469/2024 కేసులో విశాల్ గున్నిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
విశాల్ గున్ని సస్పెన్షన్ కాలపరిమితిపై నిర్ణయం తీసుకునేందుకు 2026 జూన్ 12న ఉన్నత స్థాయి రివ్యూ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ సస్పెన్షన్‌ను పొడిగించాలని సిఫార్సు చేసింది. విశాల్ గున్ని ప్రస్తుతం ఉన్నత పోలీస్ హోదాలో ఉన్నందున, ఒకవేళ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తే కేసులోని సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆయన విధుల్లోకి వస్తే ప్రస్తుతం జరుగుతున్న క్రిమినల్ కేసు విచారణ సజావుగా సాగకపోవచ్చని, విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని కమిటీ వ్యాఖ్యానించింది. కమిటీ ఇచ్చిన నివేదిక, ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్-1969 నిబంధనలను పరిశీలించిన ప్రభుత్వం, సస్పెన్షన్ కొనసాగింపునకు ఆమోదం ముద్ర వేసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని వివాదాస్పద పరిణామాలు, ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు వంటి వ్యవహారాల్లో ఐపీఎస్ అధికారుల పాత్రపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణను వేగవంతం చేస్తూ, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే విచారణ ఎదుర్కొంటున్న విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేయగా, ఇప్పుడు దానిని మరికొంత కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి...
‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం
మలేషియా మోడల్‌పై ఏపీ ఫోకస్.. బుకిత్ తగర్‌లో నారాయణ పర్యటన
Read Latest AP News And Telugu News