ఇంజినీరింగ్ కనీస ఫీజు పెంపుపై అపెక్మా హర్షం.. మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:25 PM
ఇంజినీరింగ్ కనీస ఫీజును రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అపెక్మా ( ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్) సంతోషం వ్యక్తం చేసింది. తాత్కాలిక ఫీజు పెంపుపై ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
అమరావతి, నవంబర్ 17: ఇంజినీరింగ్ కనీస ఫీజును రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అపెక్మా (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్) సంతోషం వ్యక్తం చేసింది. తాత్కాలిక ఫీజు పెంపుపై ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కాగా.. కొత్త బ్లాక్ పీరియడ్ (2026–29)కు సంబంధించిన పూర్తిస్థాయి ఫీజుల వివరాలను ప్రభుత్వం.. రాబోయే రెండు నెలల్లో ఖరారు చేయనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సుమారు రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం నెలకు రూ.200 నుంచి రూ.250 కోట్లను ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేస్తోంది. కాగా.. నెలకు రూ. 400 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని అపెక్మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
2025–26 విద్యా సంవత్సరానికి రూ.1,800 కోట్ల ప్రొసీడింగ్స్ జారీ కాగా, ఇప్పటివరకు రూ.1,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న రూ.800 కోట్లను రాబోయే 2–3 నెలల్లో క్లియర్ కానున్నాయని అపెక్మా వెల్లడించింది. కాగా.. 2026–27 విద్యా సంవత్సరం ఫీజుల్లో కనీసం 50 శాతం నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాలని ప్రభుత్వనికి అపెక్మా విన్నవించుకుంది. విద్యార్థులకు నేరుగా అందాల్సిన ఎంటీఎఫ్ (MTF) నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది.
విద్యార్థుల సర్టిఫికెట్లు & అడ్మిషన్ల సమస్యలపై ఇంజనీరింగ్ కళాశాలలకు అపెక్మా కీలక ఆదేశఆలు జారీ చేసింది.
– ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఏ కళాశాల యాజమాన్యం నిలిపివేయవద్దని స్పష్టం చేసింది.
– ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా సర్టిఫికెట్ల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే అపెక్మాను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది.
– హాస్టల్, బస్సు ఫీజుల పేరుతో అడ్మిషన్లను అడ్డుకోవద్దని, కనీస ఫీజులతో ప్రవేశాలు కల్పించాలని కళాశాలలకు దిశానిర్దేశం చేసింది.
– అడ్మిషన్లు ఆలస్యం కావడం, అటెండెన్స్ పోస్టింగ్ సమస్యలతో రీయింబర్స్‌మెంట్ అర్హత కోల్పోయిన విద్యార్థుల డేటాను క్రమబద్ధీకరించాలని కోరింది.