అనుమతి లేకుండా ధర్నా.. ఉద్యోగులపై చర్యలకు ఆదేశాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:20 AM
విజయవాడ ధర్నాచౌక్‌లో అనుమతి లేకుండా ధర్నా చేసిన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
అనుమతి లేకుండా ధర్నాచేసిన ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు
నేటి సాయంత్రంలోగా గుర్తించి సమాచారమివ్వాలని కలెక్టర్లకు నిర్దేశం
46 మందిపై శాఖాపరమైన చర్యలు?
నాటి ధర్నాపై ఇప్పటికే కేసు పెట్టిన బెజవాడ పోలీసులు
అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గత నెల 27న విజయవాడ ధర్నాచౌక్‌లో అనుమతి లేకుండా ధర్నా చేసిన స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. అనుమతి లేకుండా జిల్లాల నుంచి విజయవాడకు వచ్చి ధర్నా చేసిన సిబ్బందిని గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది. ఆదివారం సాయంత్రంలోపు వారిని గుర్తించి సమాచారమివ్వాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం 46 మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీ స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపుతో గత నెల 27న విజయవాడలో ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ధర్నాకు అనుమతి లేదని, అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించవద్దని పోలీసులు ముందుగానే వారికి సూచించినా.. టధర్నా చౌక్ నుంచి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్లేందుకకు ప్రయత్నించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
రహదారిపై ఆందోళన చేపట్టడంతో నాలుగు చక్రాల వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయిందని వెల్లడించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు కొనసాగించారని పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులు ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రభుత్వాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. బందోబస్తు విధుల నిర్వహణలో గుండెపోటుతో చనిపోయిన నున్న సీఐ అహ్మద్ ఆలీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి డీబీవీ స్వామి తప్పుపట్టారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు కట్టుదప్పి వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సిబ్బందిపై చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. కాగా..నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దర్నా చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై సత్యనారాయణపురం పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ 170 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి: