Share News

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి.. చంద్రబాబు

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:09 PM

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలపై అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమీక్షనిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పుష్కరాలకు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి.. చంద్రబాబు

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలపై అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమీక్షనిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పుష్కరాలకు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల కోసం 22 శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు పరిపాలనా అనుమతులు దక్కాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో పుష్కరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వచ్చంధ సంస్థలు, యువత, మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. అన్ని శాఖలు జిల్లాల వారీగా పనుల పురోగతి, నిధుల వినియోగం వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే పుష్కర విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, సమన్వయ సమావేశాలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు.


పరివాహక ప్రాంతంలో 440 ఘాట్లు

గోదావరి పరివాహక ప్రాంతంలో 440 ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రచించారు. దాదాపు రూ.649.70 కోట్ల విలువైన 659 పనులు ఇప్పటికే ప్రారంభంకాగా.. రూ.25.53 కోట్ల విలువైన 69 పనులు పూర్తయ్యాయి. తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య సిబ్బంది, వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, లైటింగ్ పనులకు రూ.464 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు చేశారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాహనాల క్రమబద్ధీకరణ కోసం 268.12 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల కోసం 4,000 ప్రత్యేక బస్సులు, 649 గ్రీన్ బస్సులు నడిపనున్నారు. అలాగే 1,560 ప్రత్యేక రైలు సర్వీసులు నిర్వహించేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం, ఫుట్ఓవర్ బ్రిడ్జిల అభివృద్ధి చేయనున్నారు.


ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్

పుష్కరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు సమాచారం అందించేందుకు 135 భాషల్లో సేవలందించే ఏఐ చాట్‌బాట్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 100 పడకల ఏర్పాటు చేస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను ఏప్రిల్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. రాజమహేంద్రవరం–పోలవరం మధ్య 40 కిలోమీటర్ల జలమార్గంలో ఆరు ఫ్లోటింగ్ పంటూన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ, గోదావరి జలాల నాణ్యత పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగంపై దృష్టి పెట్టనున్నారు.


ఇవి కూడా చదవండి...

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం

పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ

Updated Date - Nov 21 , 2026 | 07:09 PM