నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. అన్న మరణాన్ని తట్టుకోలేక చెల్లెలు మృతి
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:04 PM
నెల్లూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా.. ఆ విషాదాన్ని తట్టుకోలేక అంత్యక్రియలకు హాజరైన చెల్లెలు కూడా గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
నెల్లూరు, నవంబరు 21: జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అన్న మరణవార్తను తట్టుకోలేక చెల్లెలు కూడా ప్రాణాలు విడిచిన విషాద సంఘటన రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అన్నాచెల్లెళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు.. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పొదలకూరు మండలం చెర్లోపల్లికి చెందిన ప్రభాకర్ నాయుడు (65) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం ప్రభాకర్ నాయుడు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మనుబోలు మండలం గొట్లపాలెంకు చెందిన ఆయన చెల్లెలు విమలమ్మ (50) అన్న అంత్యక్రియలకు హాజరయ్యారు. ఎంతో ఆప్యాయంగా ఉండే అన్నను కోల్పోయిన బాధతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అన్నకు తుది వీడ్కోలు పలుకుతున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
అన్నకు అంతిమ వీడ్కోలు పలుకుతుండగానే చెల్లెలి మృతి..
అన్న అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో విమలమ్మ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వారు ఆమెను చికిత్స నిమిత్తం పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విమలమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అప్పటివరకు అన్న మృతితో విషాదంలో ఉన్న కుటుంబంలో మరో పెను విషాదం అలుముకుంది. ఒకవైపు అన్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, మరోవైపు చెల్లెలు కూడా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్కు నాలుగు సూటి ప్రశ్నలు..
ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?