సీబీఐ ఇన్‌స్పెక్టర్ వదిలి సన్యాసిగా మారిన అధికారి.. ఎందుకంటే!
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:25 PM
కోట్ల రూపాయల ఆస్తులు, కారు, విలాసవంతమైన జీవితం.. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం ఎందుకు అనుకున్నారో ఏమో.. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వృత్తి, హోదా, అధికారం, డబ్బు.. ఇవన్నీ ఉన్నా మనిషికి నిజమైన ప్రశాంతత లభిస్తుందా? జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నా మనసులో ఏదో తెలియని వెలితి వెంటాడుతుంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు తన జీవితాన్నే సమాధానంగా మార్చుకున్నారు ఓ మాజీ సీబీఐ ఇన్‌స్పెక్టర్. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలో పనిచేస్తూ, మంచి హోదా, కారు, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం సంపాదించిన ఆయన.. చివరకు ఆ జీవితాన్నే వదిలి సన్యాసిగా మారారు. ఆధునిక ప్రపంచపు హంగులు.. విలాసాలకు దూరంగా అడవుల్లోని గుహలను తన నివాసంగా మార్చుకున్నారు.
తనలో వచ్చిన ఈ మార్పు గురించి వివరిస్తూ.. జీవితపు అసలు సత్యం గుహల్లోనే తెలుసుకున్నానని వెల్లడించారు. సీబీఐలో పనిచేస్తున్న సమయంలో విధుల్లో భాగంగా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చేదని.. అది తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండేదని చెప్పారు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా తాను కోరుకున్న స్వేచ్ఛ, మనశ్శాంతి లభించలేదని వివరించారు.
నర్మదా నది తీరంలో మారిన జీవితం..
జీవితంలో ఏదో వెతుక్కుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయనకు మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్ సమీపంలో నర్మదా నది తీరం కొత్త దారిని చూపించింది. నర్మదా పరిక్రమలో భాగంగా నది ఒడ్డుకు చేరుకున్న తర్వాత తనలోని ఆందోళనలు తొలగిపోయినట్లు అనిపించిందని తెలిపారు. చెప్పులు, పడుకోవడానికి చాప వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా ధ్యానం, ప్రార్థనలు కొనసాగించారు. దొరికిన ఆహారంతో జీవనం సాగిస్తూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయ్యారు. అనంతరం ఓ పర్వతంపై ఆలయం.. సాధువుల సాంగత్యం లభించడంతో కొన్నేళ్లపాటు అక్కడే గడిపారు. ప్రస్తుతం దట్టమైన అడవిలోని గుహల్లో ఉంటూ.. పొయ్యిపై వంట చేసుకుంటూ ధ్యానం చేస్తున్నారు.

అవినీతి ఇంటి నుంచే మొదలవుతుంది..
ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో అవినీతి పెరగడానికి గల కారణాలపైనా మాజీ అధికారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అవినీతి అనేది కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనో, అధికార వ్యవస్థలోనో ప్రారంభం కాదని, దానికి పునాది ఇళ్లలోనే పడుతుందని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇరుగుపొరుగు వారి సంపదతో పోల్చడం.. ఇతరుల కంటే ఎక్కువ సంపాదించాలనే ఒత్తిడి తీసుకురావడం వల్ల వారిలో తప్పుడు ఆలోచనలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్ వంటి ఉన్నత స్థానాల్లోకి వెళ్లడమే పిల్లల విజయంగా భావించకూడదని, ముందుగా వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దాలని సూచించారు. సన్యాసం అంటే కేవలం దుస్తులు మార్చుకోవడం కాదని, చేసే పనిని చిత్తశుద్ధితో, నిబద్ధతతో నిర్వర్తించడమే నిజమైన పవిత్రత అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...
తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం
పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ
Read Latest AP News And Telugu News