Share News

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం..

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:36 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ'కి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు, మచిలీపట్నం గోవా షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం..
AP Cabinet Approves Social Media Influencers Policy, Machilipatnam Shipbuilding Unit

అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ'కి ఆమోదం తెలపడంతో పాటు, కృష్ణా జిల్లా అభివృద్ధికి దోహదపడే మచిలీపట్నం గోవా షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.


సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విశ్వసనీయ ఇన్‌ఫ్లూయెన్సర్లను గుర్తించి, వారిని ఎన్‌రోల్ చేసుకోనున్నారు. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా కేటగిరీలుగా విభజించి పారితోషికం చెల్లిస్తారు.

  • 1,00,000 పైగా ఫాలోవర్లు: గరిష్ఠం గా రూ. 15,000

  • 50,000 నుంచి 99,999 ఫాలోవర్లు: గరిష్ఠంగా రూ. 7,500

  • 25,000 నుంచి 49,999 ఫాలోవర్లు: గరిష్ఠంగా రూ. 5,000

  • 10,000 నుంచి 24,999 ఫాలోవర్లు: గరిష్ఠంగా రూ. 2,500

మచిలీపట్నంలో 'గోవా షిప్ బిల్డింగ్ యూనిట్'

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో గోవా షిప్ బిల్డింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ యూనిట్ ఏర్పాటుకు యాజమాన్యం తక్షణమే సిద్ధంగా ఉండటంతో, కృష్ణా జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కేబినెట్ ధీమా వ్యక్తం చేసింది. షిప్‌యార్డు ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి లోకేష్‌కు మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది.

ఇతర కీలక నిర్ణయాలు

వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరట: స్వర్ణ వార్డు సచివాలయంలోని ఎంట్రీ లెవెల్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రత్యేక సర్వీసు రూల్ జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్ట్ లేకుండా ఆలోచనారహితంగా రిక్రూట్ చేసిందని విమర్శించారు.

వర్షపాతం, వ్యవసాయం: సెప్టెంబర్‌లో పడిన వర్షాలు 3 శాతం అధికంగా ఉన్నప్పటికీ, మొత్తం సీజన్ వారీగా చూస్తే సాధారణ వర్షపాతం కన్నా 46 శాతం లోటు ఉందని చర్చించారు. వర్షాలు పడుతున్న తరుణంలో రైతులు వెంటనే విత్తనాలు వేసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.

అల్పపీడన హెచ్చరికలు: తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉన్న 7 జిల్లాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

ధరల నివారణ: ద్రవ్యోల్బణం పెరుగుతుండటంపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వెంటనే కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 07:37 PM