పోలవరం-నల్లమలసాగర్‌కు సాంకేతిక ఆమోదం తెలపండి!
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:32 AM
గోదావరి వరద జలాలపై ఆధారపడి నిర్మించే పోలవరం-నల్లమల సాగర్/బనకచర్ల రెగ్యులేటర్ అనుసంధాన పథకానికి కేంద్ర జల సంఘం పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరనుంది.
తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతలకు ఇచ్చిన ఆమోదాన్ని పునఃసమీక్షించండి
కేంద్ర జల సంఘం చైర్మన్ ముందు వాదనలు వినిపించేందుకు సిద్ధమైన ఏపీ
జల సమస్యలపై రేపు సీడబ్ల్యూసీ సమావేశం
పోలవరం-నల్లమలసాగర్‌పైనే సర్కారు దృష్టి
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద జలాలపై ఆధారపడి నిర్మించే పోలవరం-నల్లమల సాగర్/బనకచర్ల రెగ్యులేటర్ అనుసంధాన పథకానికి కేంద్ర జల సంఘం పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరనుంది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం ఆమోదించని తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలుపవద్దని డిమాండ్ చేయనుంది. ఇదే సమయంలో గోదావరి నది యాజమాన్య ట్రైబ్యునల్ మార్గదర్శకాలకు భిన్నంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి టీఏసీ ఇచ్చిన ఆమోదంపై పునఃసమీక్షించాలని వాదించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు సోమవారం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అధ్యక్షుడు అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ భేటీకానుంది. ఈ ఏడాది జనవరి 20న జరిగిన తొలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. దీంతో సోమవారం జరగనున్న రెండో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కృష్ణా నది యాజమాన్య సంస్థ, గోదావరి నదీ యాజమాన్య సంస్థల చైర్మన్లు, ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హాజరవుతారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న పోలవరం-నల్లమలసాగర్/బనకచర్ల అనుసంధాన పథకానికి సీడబ్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఆమోదముద్ర వేయడమే ప్రధాన అజెండాగా చర్చ సాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును చేపట్దేందుకు సిద్ధమైంది. అయితే, ఈ అనుసంధాన పథకాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ పథకం ప్రీ-ఫీజీబిలిటీ రిపోర్టు(పీఎఫ్ఆర్)ను ఆమోదించవద్దని కేంద్ర జల సంఘాన్ని తెలంగాణ కోరింది. అలాగే, సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించింది. తెలంగాణ వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే సమావేశంలో పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకంపై ఎలాంటి నిర్ణయం ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. పోలవరం-నల్లమలసాగర్ ఫీజిబిలిటీ రిపోర్టు ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో ఉంది.
గోదావరి-కావేరీకి కూడా..
గోదావరిలో ఏటా 90 నుంచి 120 రోజుల పాటు వరద ఉధృతి ఉంటుంది. వరద కొనసాగిన రోజుల్లో రోజుకు 2 టీఎంసీల చొప్పున తీసుకువెళ్లే ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్టును పంపించారు. దీనిని కేంద్ర జల సంఘం ఆమోదించి సాంకేతిక సలహా కమిటీ సమ్మతి తెలిపేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ కోరనుంది. ఈ పథకానికి ఆమోదముద్ర వేస్తే కేంద్రం తలస్తోన్న గోదావరి-కావేరి అనుసంధాన పథకం అమలుకు మార్గం సుగమమవుతుందని రాష్ట్రం చెబుతోంది. గోదావరి నదీ జలాల వివాద ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి పోలవరం-నల్లమలసాగర్/బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ అనుసంధాన పథకాన్ని రూపకల్పన చేశామని కేంద్ర జల సంఘానికి ఏపీ స్పష్టం చేయనుంది. అయినప్పటికీ.. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అంతర్రాష్ట్ర జల అభివృద్ధి సంస్థ, కేంద్ర జల సంఘం, సుప్రీం కోర్టులకు వెళ్లిందని ఏపీ వివరించనుంది.
ఈ వార్తలను కూడా చదవండి
ప్రజా సమస్యలపై సానుకూలంగా వ్యవహరించండి
విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే