Share News

విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:36 PM

విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేది గురువులే అని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే
అవార్డులు అందజేస్తున్న కలెక్టర్‌, మంత్రి

రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేది గురువులే అని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ రాజకుమారితో కలిసి మంత్రి పాల్గొని ఉత్తమ సేవలందించిన 45 మంది ఉపాధ్యాయులను సత్కరించి అవార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. నంద్యాల జిల్లా ఎడ్యుకేషనల్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతూ డిగ్రీ, ఇంటర్‌, ఇంజ నీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చర్‌ తదితర ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రంగా మారిందన్నారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రెడ్డి, డీఐఈవో శంకర్‌నాయక్‌, ఉపాఽధ్యాయులు, పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు శిల్పి లాంటి వారు.. : కలెక్టర్‌ రాజకుమారి

ఉపాధ్యాయుడు ఒక శిల్పి లాంటి వారని, శిల్పి ఒక రాయిని అందమైన శిల్పంగా మలిచినట్లే ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేస్తున్నామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి, కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది

విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఈ అవార్డులు రావడంతో ఉపాధ్యాయులకు మరింత బాధ్యత పెరిగింది. ఈ అవార్డులు రావడంతో ఉపాధ్యాయుల్లో పోటీతత్వం పెరుగు తుంది. ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది.

లక్ష్మణ్‌నాయక్‌, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌, రాయమాల్పురం (పీఎస్‌హెచ్‌ఎం)

చాలా సంతోషంగా ఉంది

ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇలా ప్రోత్సాహించడం ద్వారా మేం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందిస్తాం.ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై కూడా మరిన్ని ఉత్తమ అవార్డులు పొందేందుకు కృషి చేస్తా.

జైబున్నీసా, బాలికల హైస్కూల్‌, బనగానపల్లె

Updated Date - Sep 05 , 2026 | 11:36 PM