మళ్లీ పెరిగిన దాణా ధర
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:44 AM
రొయ్యల మేత ధరలు మళ్లీ పెరిగాయి. బ్లాక్ టైగర్ రొయ్యల మేత ధర కిలోకు రూ.12, వనామీ రొయ్య మేత ధర రూ.9 చొప్పున దాణా తయారీ కంపెనీలు పెంచేశాయి.
ఆక్వా రైతుపై ధరల పిడుగు
టైగర్ రొయ్య మేత కిలోకి రూ.12.. వనామీకి 9 పెంపు
రెండు నెలల్లోనే మరోసారి భారం
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రొయ్యల మేత ధరలు మళ్లీ పెరిగాయి. బ్లాక్ టైగర్ రొయ్యల మేత ధర కిలోకు రూ.12, వనామీ రొయ్య మేత ధర రూ.9 చొప్పున దాణా తయారీ కంపెనీలు పెంచేశాయి. రెండు నెలల వ్యవధిలో బ్లాక్ టైగర్ రొయ్య మేత కిలోకి రూ.24, వనామీ రొయ్యల మేత ధర రూ.18 చొప్పున పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవల్‌పమెంట్ అథారిటీ(అప్సడా) అనుమతి లేకుండా ధరలు పెంచడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. రొయ్యల మేత ధరలు పెంచాలంటే అప్సడాతో చర్చించాలని, ప్రభుత్వం నియమించిన కమిటీలో నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు గతంలో స్పష్టం చేశారు. ఆక్వా దాణా ధరలపై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీని వేసింది. రొయ్యల మేత తయారీకి వాడే ముడిపదార్ధాల ధరలపై మత్స్యశాఖ, ఎంపెడా, సిబా అధికారులు, అప్సడా, రైతు ప్రతినిధులు, దాణా తయారీ కంపెనీల ప్రతినిధులు కమిటీలో ఉన్నారు. అయినా ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా, కమిటీలో చర్చించకుండా కంపెనీలు ఏకపక్షంగా దాణా ధరలు పెంచాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ కమిటీ సమావేశం సోమవారం (గత నెల 31న) జరగాల్సి ఉండగా, మరుసటి రోజు (ఈ నెల 1న) నిర్వహించారు.
అయితే ఆగస్టు 31నే మేత ధరల పెంపుపై కంపెనీలు డీలర్లకు లేఖ రాశాయి. సెప్టెంబరు 1 నుంచి రొయ్యల మేత ధర పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. ఈమేరకు వనామీ రొయ్యల మేత కిలోకి రూ.9, బ్లాక్ టైగర్ రొయ్యల మేత కిలోకు రూ.12 పెంచుతున్నట్లు తెలిపాయి. దాణా తయారీకి వాడే ముడి పదార్ధాల ధరల పెరుగుదల కారణంగా మేత ధరలు పెంచినట్లు లేఖలో వివరించాయి. అయితే కమిటీ సమావేశానికి ముందే మేత ధరలు పెంచుతున్నట్లు పలు కంపెనీలు లేఖలు రాయడంతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కానీ ముడి సరుకుల భారం వల్ల ధరల పెంపు తప్పదని కంపెనీలు స్పష్టం చేశాయి. మేత ధరల పెంపుపై కమిటీ సమావేశంలోనే ఆక్వా రైతు ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కంపెనీలు వెనక్కి తగ్గలేదు. అప్సడా ఆమోదం లేకుండా, కమిటీ సమావేశంలో చర్చించకుండానే ధరలు పెంచేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది జూన్‌లో రొయ్యల మేత ధరలను దాణా తయారీ కంపెనీలు అమాంతం పెంచేశాయి. ముడి సరుకుల ధరలు పెరిగినందున మేత ధరలు పెంచక తప్పదని దాణా తయారీదారులు చెప్పడంతో సీఎం చంద్రబాబు స్పందించి, దాణా ధరలపై సమీక్షించారు. రైతులు, కంపెనీలు నష్టపోకుండా కిలోకు రూ.4చొప్పున ధర తగ్గించాలని సీఎం సూచించారు. అయితే కొందరు వ్యాపారులు కిలోకి రూ.2.50 మాత్రమే తగ్గించారు. రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మేత ధరలను పెంచారు. మేత ధరల పెరుగుదలతో దాణా ఖర్చు కిలోకి రూ.60పైన అదనపు భారం పడుతుందని ఒంగోలుకు చెందిన రైతు ప్రతినిధి ఈదర యశ్వంత్‌కుమార్ చెప్పారు.
కేంద్రం పరిశీలనలో సీఎం వినతులు
రాష్ట్రంలో ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రొయ్యల దాణా తయారీకి వాడే ముడి పదార్ధాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆక్వా సాగుపై ప్రభావం పడుతోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రొయ్యల మేత ధరలు భారీగా పెరిగిన కారణంగా ఉత్పత్తి వ్యయం 20శాతం కంటే అధికమైందన్నారు. గత జూలైలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి, రూ.100కోట్ల కార్పస్ ఫండ్‌తో ఏపీ ఫ్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా నిధులు మంజూరు చేయాలని, ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరారు. దేశంలో ఫిష్‌మీల్ లభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని, జీఎం సోయాబీన్ మిల్ దిగుమతికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..