సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయిపై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 26 , 2026 | 08:51 PM
సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు ఏపీ హూం మంత్రి వెలగపూడి అనిత అన్నారు.
అమరావతి, జూన్ 26: సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు ఏపీ హూం మంత్రి వెలగపూడి అనిత అన్నారు. అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని, డ్రగ్స్ నిర్మూలనలో విశేష ప్రతిభ కనబరిచిన 'ఈగల్ టాస్క్ ఫోర్స్' అధికారులకు ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టగలిగామని స్పష్టం చేశారు. గతంలో దాదాపు 17 వేల నుంచి 20 వేల ఎకరాల్లో సాగైన గంజాయి తోటలను ఇప్పుడు పూర్తిగా నిర్మూలించి, సాగును జీరో స్థాయికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గంజాయి సాగుకు అలవాటు పడిన రైతులకు నష్టం జరగకుండా, వారికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు.
గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 56 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, డ్రగ్స్ కేసులకు సంబంధించి 6 వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేశామని హోం మంత్రి వివరించారు. స్థానికంగా సాగును అరికట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి జరిగే గంజాయి రవాణాను అడ్డుకోవడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కేవలం అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాకుండా, గంజాయి బారిన పడి జీవితాలను పాడుచేసుకుంటున్న వారిని రక్షించడానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీ-అడిక్షన్ సెంటర్లను మరింత బలోపేతం చేసిందని తెలిపారు.
ఈ కేంద్రాల ద్వారా బాధితులకు కౌన్సెలింగ్, సరైన వైద్య చికిత్స అందిస్తున్నామని, చివరికి జైళ్లలో ఉన్న ఖైదీల కోసం కూడా ప్రత్యేకంగా డీ-అడిక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. దీంతో పాటు ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టంపై, డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, గంజాయి లేని నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోం మంత్రి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..
బాలిక ఛాతిపై తన్నిన అంగన్‌వాడీ వర్కర్.. వీడియో వైరల్