Share News

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:56 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
Telangana IAS Transfers

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటూ ఒకేసారి 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా బదిలీలలో భాగంగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌ను నియమించారు. అలాగే ఇప్పటివరకు సీఎంఓలో సేవలందించిన అజిత్‌రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొత్త బాధ్యతలను అప్పగించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమితులయ్యారు.


ఈ క్రమంలోనే పలువురు సీనియర్ అధికారులకు అదనపు బాధ్యతలను కూడా కేటాయించింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులు కాగా.. ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించగా.. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత, హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్‌కు ఆ శాఖలోనే మరికొన్ని అదనపు బాధ్యతలను కేటాయించగా.. అదే శాఖకు జాయింట్ సెక్రటరీగా కాత్యాయనీ దేవిని నియమించారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే.. హెచ్ఎండీఏ (HMDA) జాయింట్ కమిషనర్‌గా కె. చంద్రకళను, తెలంగాణ రెడ్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీని నియమించారు. ఆర్‌అండ్‌బీ (R&B) స్పెషల్ సెక్రటరీగా గంగాధర్‌కు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కొత్త కమిషనర్‌గా టి.వెంకన్నను నియమించారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత కీలకమైన టూరిజం డైరెక్టర్‌గా కె.విద్యాసాగర్‌ను నియమించారు.


సీఎం ముఖ్య సలహాదారుగా కె. రామకృష్ణారావు నియామకం..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30న పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రికి అడ్వైజర్ & ఎక్స్-ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం. 912 జారీ చేసింది. పరిపాలనలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని వినియోగించుకునేందుకు రిటైర్మెంట్ రోజే ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నియామకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విడిగా జారీ చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

ఆ రోతను భరించలేకపోయా.. రైల్వే ప్రయాణికుడి పోస్టు వైరల్

ఫొటోల కోసం ఫోజులిస్తే.. అలలు ప్రాణాలు తీశాయి.. వీడియో వైరల్

Updated Date - Jun 26 , 2026 | 04:24 PM