రాయలసీమను విస్మరించిన గత ప్రభుత్వం: ఎంఎస్ రాజు
ABN , Publish Date - Apr 29 , 2026 | 09:35 PM
గత ప్రభుత్వంలో రాయలసీమను పూర్తిగా విస్మరించారని వైసీపీ నేతలపై మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు మండిపడ్డారు. ఇప్పుడు రాయలసీమపై ప్రేమ ఉన్నట్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
అనంతపురం, ఏప్రిల్ 29: గత ప్రభుత్వంలో రాయలసీమను పూర్తిగా విస్మరించారని వైసీపీ నేతలపై మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు మండిపడ్డారు. ఇప్పుడు రాయలసీమపై ప్రేమ ఉన్నట్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు విలేకర్లతో మాట్లాడుతూ.. అనంతపురంలో జరిగిన సమావేశంలో జనం 15 నిమిషాలు కూడా లేరన్నారు. అందుకే పుట్టపర్తిలో ఇళ్లల్లోనే వైసీపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సరైన అనుమతులు, డీపీఆర్‌లు లేకుండా ప్రారంభించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసిందని.. దీంతో 2021లోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఎమ్మెల్యే రాజు గుర్తు చేశారు. దీనిపై సరైన కౌంటర్ కూడా వేయలేదంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. కానీ ఇది కూటమి ప్రభుత్వంలో ఆగిపోయినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు చేశారు?. హంద్రీ నీవా ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారు? అని వైసీపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలవరం నుంచి హంద్రీనీవా వరకు ఏ ప్రాజెక్టు గురించి.. ఎక్కడైనా చర్చించడానికి తాను సిద్ధమని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు సవాల్ విసిరారు.
ఏపీ ఉమ్మడి ఆస్తులపై ఎవరికీ తెలియకుండా వెళ్లి సంతకాలు పెట్టి వచ్చాడంటూ వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే రాజు నిప్పులు చెరిగారు. ఇవన్నీ ఎవరి తెలియదు అనుకుంటే అది మీ పొరపాటని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ పరంగా.. అధికారికంగా బీసీలకు పెద్ద పీట వేసింది టీడీపీనే అని వివరించారు. వైసీపీ హయాంలో ఒక సామాజిక వర్గానికే పదవులు కేటాయించారంటూ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల.. స్పందించిన కేంద్ర మంత్రి
టీడీపీకి గల్లీ పాలిటిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News