పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా.. జగన్‌కు లోకేష్ సవాల్
ABN , Publish Date - Aug 25 , 2026 | 08:32 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని అన్నారు.
అనంతపురం, ఆగస్టు 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళవారం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం నల్లంపల్లిలో నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాయదుర్గం ప్రజలకు ప్రేమ, పౌరుషం, అభిమానం ఎక్కువే
‘విజయనగరం రాజుల మూడో రాజధాని రాయదుర్గం. ఈ రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో.. ఇక్కడి ప్రజల్లోనూ అంతే పౌరుషం ఉంది. ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ ఎంత ఫేమసో.. మీ ప్రేమ, అభిమానం, స్టైల్ కూడా అంతే ఫేమస్. అవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. గత 11 ఎన్నికల్లో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచినా.. గెలిచినా, ఓడినా రాయదుర్గం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓబుళాపురం గనుల పేరుతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు కమిటీ వేసి ప్రజల తరఫున పోరాడింది టీడీపీ. నాడు మనం చేసిన పోరాటానికి ఫలితంగా తాజాగా తీర్పు వచ్చింది’.
‘ప్రజల కోసం పోరాడింది.. ప్రజల తరఫున నిలబడింది తెలుగుదేశం పార్టీనే. మీ అందరి కష్టం, శ్రమతో 2024లో కాలవ శ్రీనివాసులును 43 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నాం. పట్టుదల, క్రమశిక్షణతో నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్న కాలవ శ్రీనివాసులు.. ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉంది. ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’.
‘రాయదుర్గం ప్రాంతంపై కూడా ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా కాలవ శ్రీనివాసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అసెంబ్లీలో నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రానికి అవసరమైన అంశాలపై కూడా మాకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు’ అని నారా లోకేష్ తెలిపారు.
కార్యకర్తలే పార్టీకి బలం
‘ఈ రోజు మేము మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వేదికపై కూర్చున్నామంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 2019 - 24 మధ్య దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు ఎదురైనా ఎత్తిన పసుపు జెండాను దించకుండా పార్టీ కోసం పోరాడారు’.
‘గొడ్డలి పార్టీ కుట్రలకు, అక్రమ కేసులకు భయపడకుండా నిలబడిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. దేశంలో మరే రాజకీయ పార్టీ కల్పించని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశాం. కష్టపడి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం’ అని నారా లోకేష్ చెప్పారు.
మైటీడీపీ యాప్‌లో మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. నేను పరిష్కరిస్తాను
‘యువగళం పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు.. ‘పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. మమ్మల్ని గుర్తించండి’ అని చాలామంది కోరారు. అందుకే మైటీడీపీ యాప్‌ను తీసుకొచ్చాం. మీరు పాల్గొనే ప్రతి పార్టీ కార్యక్రమం, మీరు సొంతంగా చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మైటీడీపీ యాప్‌లో ఫీడ్ చేయండి. క్లస్టర్, యూనిట్, బూత్ సమావేశాల్లో మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మేము చదువుతున్నాం. మీరు చెప్పే సమస్యలు, సూచనలు మాకు చేరడం లేదనే అపోహ వద్దు. కొత్త పెన్షన్లు, ఇళ్లు ఇవ్వాలని కార్యకర్తలే ఫీడ్‌బ్యాక్‌లో కోరారు’.
‘కొత్త పెన్షన్‌లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. ఇలా మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నేను నిర్ణయాలు తీసుకుంటాను. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.. మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం’.
‘కోటి మంది సభ్యులతో కూడిన కుటుంబం మనది. సముద్రం లాంటి ఈ కుటుంబంలో సమస్యలు సహజం. మనలో మనమే చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడైనా మీ సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి. మీకు అండగా నేను ఉంటాను. కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాం’ అని కార్యకర్తలకు నారా లోకేష్ హామీ ఇచ్చారు.
టీడీపీలో కార్యకర్తే అధినేత
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అనంతరం కార్యకర్తలను కలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడి, ఫొటో దిగి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే విలువకు ఇదే నిదర్శనం. 2025 మహానాడులో ప్రవేశపెట్టుకున్న ఆరు శాసనాల్లో ‘కార్యకర్తే అధినేత’ అనేది అత్యంత ముఖ్యమైనది. టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే మహానాడు, అసెంబ్లీ, మండలి సహా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి వేదికను పంచుకుంటున్నారు.
‘కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడం టీడీపీ బాధ్యత. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలు వదిలిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టాన్ని సవరించి బిల్లు తీసుకొచ్చాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బిల్లును చట్టంగా చేసి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి ఇదే నిదర్శనం’ అని లోకేష్ పేర్కొన్నారు.
అనంత అభివృద్ధి నా బాధ్యత
‘ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మా కుటుంబాన్ని ఆశీర్వదించి గెలిపించిన ప్రజలు అనంతపురం జిల్లా ప్రజలు. నాడు ఎన్టీఆర్‌ని గెలిపించి అసెంబ్లీకి పంపించిన గొప్ప నేల ఇది. మా హరిమామను శాసనసభకు, పార్లమెంట్‌కు, మా ముద్దుల మామ బాలకృష్ణను మూడు సార్లు అసెంబ్లీకి పంపించిన ఘనత అనంతపురం ప్రజలది. ఈ అభిమానాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అహర్నిశలు మీ కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అందుకే అనంతపురం జిల్లాకు ప్రత్యేక సంస్థలు, పరిశ్రమలు తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాం’.
‘ఇప్పటికే సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రతిష్టాత్మకమైన ఫైటర్ జెట్ తయారీ సంస్థ కూడా అనంతపురం ప్రాంతానికి సొంతమైంది. ఏ రంగంలో అయినా ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అదే పోటీతత్వం ఎమ్మెల్యేల మధ్య కూడా ఉండాలి. ఉరవకొండలో తయారయ్యే విండ్‌మిల్‌పై “మేడ్ ఇన్ ఉరవకొండ” అని మంత్రి కేశవ్ పెట్టుకుంటున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాలకు కంపెనీలు తీసుకురావాలి.. తమ నియోజకవర్గానికి పేరు రావాలని పోటీతత్వంతో పనిచేయాలి’ అని లోకేష్ కోరారు.
రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్నాం. దీపం 2.0 కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాం. తల్లికి వందనం, చేనేతలకు ఉచిత విద్యుత్, చేనేత సేవ, మత్స్యకార సేవ, ఆటోవాలా సేవ వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఆర్థిక సహాయం అందిస్తున్నాం’.
‘పెన్షన్ల కోసం ఏటా రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైల్‌పైనే చేశారు. వెంటనే దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చి 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. ఎన్ని కేసులు వేసి అడ్డుకోవాలని చూసినా నియామకాలు పూర్తి చేశాం. కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. పరిశ్రమలను ఆకర్షిస్తూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం’.
‘నేడు పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు. గొడ్డలి పార్టీలో గొడ్డలి బ్యాచ్, ఫ్యాక్షనిస్టులు, దొంగలు ఉంటారు కాబట్టే వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కానీ చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం చుట్టూనే ఉంటుంది. ఆ మార్పును మనమంతా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’ అని నారా లోకేష్ తెలిపారు.
గొడ్డలి పార్టీవి అన్నీ డ్రామాలే
‘నేడు మనం గొడ్డలి పార్టీతో రాజకీయంగా పోరాడుతున్నాం. వారిలో వారే హత్యలు చేసుకుని.. ఆ నిందను మనపై వేసే నైజం వారిది. సొంత బాబాయిని హత్య చేసిన ఘటనలో ప్రొడక్షన్, డైరెక్షన్, ఫైనాన్స్ మొత్తం వాళ్లదే. 2019లో గొడ్డలి పార్టీకి చెందిన దొంగ పత్రికలో “నారాసుర రక్త చరిత్ర” అంటూ ఫొటో ప్రచురించి చంద్రబాబుపై నిందలు వేశారు. ఆ ప్రచారాన్ని చూసి బాబాయి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి’.
‘తాజాగా వారి ఎంపీ ఇంట్లోనే నోట్ల కట్టలు బయటపడటం దీనికి మరో ఉదాహరణ. కోడి కత్తి డ్రామా.. గులకరాయి డ్రామా. గులకరాయి వ్యవహారమైతే మరో హైలైట్. టెన్నిస్ బాల్ కంటే వేగంగా తిరిగిన ఆ రాయి.. జగన్‌కు తగిలి కింద పడాల్సింది పోయి పక్కనే ఉన్న ఓ నటుడికి తగిలిందట. మరీ విచిత్రంగా ఆ నటుడు ఒకరోజు ఒక వైపు, మరో రోజు మరో వైపు కట్టు కట్టుకుని కనిపించాడు. 2019-24 మధ్య గొడ్డలి పార్టీ హయాంలో కల్తీ మద్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు’.
‘అదే సమయంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతోంది. పూర్తి ఆధారాలతో గొడ్డలి పార్టీ మాజీ మంత్రిని ఈడీ అరెస్ట్ చేస్తే.. దానిపై కూడా మనల్ని తప్పుబడుతున్నారు. ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ.. మనం చెబితే అరెస్టు చేసే జేబు సంస్థ కాదు. గొడ్డలి పార్టీ నుంచి భవిష్యత్‌లో ఇంకా ఎన్ని డ్రామాలు చూడాల్సి వస్తుందో!’ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి
‘జగన్ ప్రెస్‌మీట్ పెడితే మనందరికీ పండగే. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పే విషయం ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనంటారు. జగన్ రెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చేయి.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీలోనూ ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’.
‘నా సవాల్‌ను స్వీకరించి ఎందుకు రావడం లేదు? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదనే వాస్తవం బయటపడుతుందనే భయమా? ప్రెస్‌మీట్లు ఎందుకు.. అసెంబ్లీకి రా! పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదు? రెండేళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అది కూడా ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. జగన్‌లా నేను కంచుకోటలో గెలిచిన వ్యక్తిని కాదు’.
‘1988 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడినా వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించాను. కుప్పంలో పోటీ చేయమని చెప్పినా మంగళగిరిలోనే నిలబడి 91 వేల మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబుకి గిఫ్ట్‌గా ఇచ్చాను. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే.. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా..!’ అని వైఎస్ జగన్‌కు లోకేష్ సవాల్ విసిరారు.
కూటమి ఐక్యతను కాపాడండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం
“కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల ప్రచారాన్ని నమ్మి ఆవేశపడకుండా కూటమి ఐక్యతను కాపాడాలి’.
‘మనమంతా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి కూటమి బలాన్ని మరింత పెంచాలి’ అని కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు.
కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది
‘మీ అభిమానానికి నేను ధన్యుడిని. యువగళం పాదయాత్రలో కణేకల్‌కు రాలేకపోయిన లోటు నేడు తీరిపోయింది. మీరు ఇచ్చిన ఘన స్వాగతం, చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. పట్టణ అధ్యక్షుడి ఆత్మీయ పలకరింపు నా గుండెను హత్తుకుంది. వీలైతే మీ ఇంటికి భోజనానికి వస్తాను. గతంలో కణేకల్‌కు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కానీ కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది. నిధులు సమకూర్చే బాధ్యత మంత్రి కేశవ్‌ది’.
‘రెండు సంవత్సరాల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జి. శ్రీధర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు బి. గురప్పతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వారిద్దరిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్
యూఎస్ పర్యటనపై సీఎం రేవంత్ క్లారిటీ ఇవ్వాలి: కిషన్ రెడ్డి
For More AP News And Telugu News