Share News

కరువు నేలపై కొత్త వెలుగు

ABN , Publish Date - Sep 16 , 2026 | 04:25 AM

కియ, అనుబంధ పరిశ్రమల రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుని వేలాది మందికి స్థానికంగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి. పెనుకొండ పరిసర గ్రామాలు, కాలనీల్లో మౌలిక వసతులు, వ్యాపారాలు, భూముల విలువలు పెరగడంతో స్థానికుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి.

కరువు నేలపై కొత్త వెలుగు
Penukonda development

  • కియ, అనుబంధ సంస్థల రాకతో మారిన చిత్రం

  • ఉమ్మడి అనంతపురం జిల్లాకు వరం

  • 15 వేల మంది స్థానిక యువతకు ఉపాధి

  • అనుబంధ సంస్థల్లోనూ వేలాదిమందికి

  • అభివృద్ధి బాటలో ‘పెనుకొండ’ పల్లె సీమలు

  • దారిపొడవునా వ్యాపార సముదాయాలు

  • నాటి నిర్మానుష్య ప్రాంతాల్లో పెరిగిన రద్దీ

  • స్థలాలు, భూములకు భారీ డిమాండ్‌

  • మెరుగుపడిన జిల్లా, గ్రామీణుల జీవనం

ఓ ప్రాంతానికి కొత్తగా ఒక పరిశ్రమ వస్తే.. అనుబంధ కంపెనీలు వస్తాయి. దీని ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా చుట్టు పక్కల కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. భూముల విలువ పెరుగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, రవాణా, ఇంటి అద్దెలు.. ఇలా ఎన్నో రకాలుగా జీవనోపాధి మెరుగవుతుంది. గ్రామాలు, కాలనీల ముఖచిత్రమే మారిపోతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు కియ, అనుబంధ సంస్థల రాకతో ఈ అభివృద్ధి మార్క్‌ కనిపిస్తోంది. కరువు నేలపై కొత్త వెలుగు వచ్చింది.


(అనంతపురం ఉన్నత విద్య/పెనుకొండ రూరల్-ఆంధ్రజ్యోతి)

యువతకు ఉపాధి కావాలంటే వలస వెళ్లాల్సిందే. పోతే దగ్గరలోని బెంగళూరుకు.. లేదా హైదరాబాద్‌, ముంబై వంటి ఇతర ప్రాంతాలకు. అంతేకానీ స్థానికంగా ఉపాధి దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పరిస్థితి ఇదీ. కియ రాకతో ఈ పరిస్థితిలో కొంత వరకు మార్పు వచ్చింది. కియ, అనుబంధ కంపెనీలు ఓ వరంలా మారాయి. వేలాది మందికి స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాయి. కియ కంపెనీలో దాదాపు 30 వేలమంది తెలుగువారు పనిచేస్తుండగా, వారిలో 15 వేలమందికి పైగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినవారు ఉన్నారు. అనంతపురం నగరంతో పాటు పట్టణాలు, మారుమూల గ్రామాలకు చెందినవారికి సైతం ఉపాధి లభించింది.


వివిధ ప్రాంతాల నుంచి రోజూ కియ కంపెనీకి వచ్చి పనిచేసి తిరిగి వెళ్తున్నారు. వారికి రవాణ సదుపాయం కంపెనీయే కల్పిస్తోంది. ఒక్క అనంతపురం నగరం నుంచే రోజూ దాదాపు 250 బస్సుల్లో ఉద్యోగులు వెళ్లి వస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పట్టణాలు, మారుమూల గ్రామాలకు సైతం కియ వాహనాలు వెళ్తున్నాయి. ఉన్న చోట నుంచే ఉద్యోగం కోసం ఇలా రోజూ కంపెనీ బస్సుల్లో వెళ్లి తిరిగి రావడం గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడని దృశ్యం. సరిహద్దున కర్ణాటక ప్రాంతం నుంచి కూడా రోజూ కియాలో పనిచేసేందుకు వస్తున్నారు. ఇక కియ అనుబంధ పరిశ్రమలు రావడం వల్ల కూడా వేలాదిమందికి స్థానికంగా ఉపాధి లభిస్తోంది.


పెనుకొండ ప్రాంతంలో దాదాపు 27 అనుబంధ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలకూ ఉపాధి లభించింది. కియ, అనుబంధ పరిశ్రమల రాకతో ఒక్క అమ్మవారుపల్లి మాత్రమే గాక పెనుకొండ దాని చుట్టు పక్క గ్రామాల రూపురేఖలు మారాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. కూలినాలి చేసుకునే స్థితి నుంచి ఉద్యోగాలు చేసుకునే స్థాయికి ఎదిగారు. స్వయం ఉపాధి అవకాశాలు లభించాయి. దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది.


మారిన గ్రామాల తలరాత

పెనుకొండ సమీపంలోని వ్యవసాయాధారిత గ్రామాలైన తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లి, ఇస్లాపురం గ్రామాలు పదేళ్ల క్రితం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. కియ రాకతో ఈ గ్రామాల తలరాత మారిపోయింది. సీసీ రోడ్లు, సోలర్‌ వెలుగులు, ఇతర మౌలిక వసతులు మెరుగు పడ్డాయి. బయటి ప్రాంతాల వ్యక్తులు ఇక్కడ స్థిరపడటంతో ఓటర్లు పెరిగారు. ఈ మూడు గ్రామాలను ప్రభుత్వం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆయా గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనకు కియ అనుబంధ పరిశ్రమలు ముందుకొచ్చాయి. కియ రాకముందు తిమ్మాపురంలో 100 పొదుపు సంఘాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 360కి పైగా పొదుపు సంఘాలు ఉన్నాయి. జనాభా పెరగడంతో పాటు మహిళల్లో చైతన్యం రావడం ఇందుకు ఓ కారణం. తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు కియ పరిశ్రమతో పాటు అనుబంధ సంస్థలు అభివృద్ధి పనులు చేపడుతున్నాయి.


పురోగతిలో కాలనీలు

దశాబ్దం కిందట పెనుకొండ పట్టణ ముఖద్వారంలో ఉన్న టీడీపీ కాలనీ, ఇందిరమ్మ కాలనీలంటే... కొండ కింద, ఊరు బయట ఉంటాయని ఎవరూ అక్కడ స్థలం కొనేవారు కాదు. కియ రావడం, రవాణా సదుపాయాలు మెరుగు పడటం, రైల్వే జంక్షన్‌ సమీపంలో ఉండటం, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించడంతో ఆ కాలనీలు ఇప్పుడు ఆకర్షణగా మారిపోయాయి. పెనుకొండ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు ఆ కాలనీల్లో స్థలాల కొనుగోలు కోసం పోటీపడుతున్నారు. టీడీపీ కాలనీ సమీపంలోనే కియ పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఆ కాలనీ రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఆ కాలనీలో రూ.20 వేలు ఉన్న సెంటు ధర ప్రస్తుతం రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ పలుకుతోంది. ప్రస్తుతం అక్కడ 250 కుటుంబాలు నివాసముంటున్నాయి. పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలో దాదాపుగా 700కు పైగా కుటుంబాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ రెండు కాలనీల్లోనూ పచ్చదనానికి పెద్ద వేయడంతో ప్రతి ఇంటి వద్ద చెట్లు కనిపిస్తాయి. పెనుకొండ సమీపం నుంచి చూస్తే ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.


నా కొడుకు జీతమే ఆధారం

కియ కంపెనీ వచ్చిన తరువాత మా ఊరు బాగుపడింది. ఇప్పుడు ఏం కావాలన్నా అన్నీ మా ఊళ్లోనే దొరుకుతున్నాయి. బయటికి పోయే పనిలేదు. నా కొడుకు నరేశ్‌ కియ కంపెనీలో పార్ట్స్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. నా కొడుకు జీతం మీదనే ఇల్లు గడుస్తోంది. పింఛన్‌కు అర్జీ పెట్టుకున్నా. అదొక్కటి వస్తే ఇంకేమీ సమస్య లేదు.

- నరసింహమూర్తి, వెంకటరెడ్డిపల్లి


వారి సాయం మరువలేనిది

గత సంవత్సరం పాఠశాల గదులు పెచ్చులూడి అధ్వాన స్థితిలో ఉండేవి. నాకు తెలిసిన వారి ద్వారా కియ అనుబంధ పరిశ్రమ శ్యామ్‌సంగ్‌ ఇండస్ర్టీ్‌సకు చెందిన నవీన్‌, సుధను కలిశా. వారు వెంటనే పాఠశాలకు రూ. లక్ష విలువ చేసే రంగులు వేయించారు. వారిచ్చిన స్ఫూర్తితోనే సత్యసాయి భక్తులను కలవగా వారు పాఠశాలకు రేకుల షెడ్డును వేయిస్తున్నారు. పాఠశాల అన్నీ రకాలుగా అభివృద్ధి జరుగుతోంది.

- నారాయణస్వామి, హెచ్‌ఎం, వెంకటరెడ్డిపల్లి


ఎకరా స్థలంలో దుకాణాలు నిర్మించా

కియ రాకముందు ఇక్కడ ఎకరా స్థలం రూ.25 లక్షలు ఉండేది. ఇప్పుడు ఎకరా రూ.4 కోట్లు పలుకుతోంది. కియ వ చ్చాక నా తమ్ముడు తన ఎకరా భూమి అమ్ముకొని బెంగళూరులో ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పెట్టుకున్నాడు. నా భూమిలో దుకాణాలను నిర్మిం చి అద్దెకిచ్చాను. కియ అనుబంధ సంస్థలు దగ్గర్లోనే ఉండటం, మధ్యలో కాలనీ ఉండటంతో బాగా అభివృద్ధి చెందింది.

- దత్తాత్రేయ, మాజీ సర్పంచ్‌, టీడీపీ కాలనీ


బిహార్‌ నుంచి వచ్చా

మాది బిహార్‌ రాష్ట్రం. అక్కడ చాలీచాలని సంపాదనతో బతికేవాణ్ని. ఆంధ్రలో కియ పరిశ్రమ ఏర్పడిందని, అమ్మవారుపల్లి సమీపంలో కంటైనర్లకు సంబంధించి టైర్ల రిపేరీ షాపును ఏర్పాటు చేసుకుంటే మంచి సంపాదన ఉంటుందని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు. దీంతో ఇక్కడికి వచ్చి జాతీయ రహదారి పక్కన షాపు ఏర్పాటు చేసుకున్నా. నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్నా.

- అబ్దుల్లా, బిహార్‌


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
కొలువుల జాతర

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 04:25 AM