Share News

వరసిద్ధుడికి బ్రహ్మోత్సవ వైభవం

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:59 AM

కాణిపాకంలో ఘనంగా ధ్వజారోహణం రాత్రి హంస వాహనంపై ఊరేగిన ఉత్సవర్లు

వరసిద్ధుడికి బ్రహ్మోత్సవ వైభవం
హంస వాహనంపై ఊరేగుతున్న ఉత్సవర్లు

ఐరాల(కాణిపాకం),సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో మొదలయ్యాయి. అణివేటి మండపంలోని ధ్వజస్తంభాన్ని అభిషేకించాక, అనుజ్ఞ, గణపతిపూజ, మృత్‌ సంగ్రహణం, వాస్తుశాంతి, నవసంధి బలి, పుణ్యహవచనం, మూషిక యాగం, ధ్వజపట పూజ, ధ్వజ స్తంభ అభిషేకం, వాస్తుబలి, మహా హారతి ఇచ్చారు. ఉదయం 7.15- 8.15 గంటల మధ్య స్వాతి నక్షత్రయుక్త శుభ కన్యాలగ్నంలో మూషిక ధ్వజపటాన్ని నింగికి ఎగుర వేశారు. ఈ బ్రహ్మోత్సవాలను కామికా ఆవాహన పద్ధతిలో నిర్వహిస్తారు. రాత్రి హంస వాహన సేవకు కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లె గ్రామాలకు చెందిన శీర్‌కరుణీక వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉభయ వరస రావడంతో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు పూజలు చేసి హంస వాహనంపై ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌, బోర్డు సభ్యులు నాగరాజనాయుడు, అనసూయ, వసంతమ్మ, శివప్రసాద్‌, కృష్ణవేణి, పద్మలత, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 01:59 AM