పొలానికి వెళ్లిన రైతుపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి.. 40కి పైగా కుట్లు
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:28 AM
అనంతపురం జిల్లాలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. పొలానికి వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
అనంతపురం, ఆగస్టు 26: జిల్లాలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. పొలానికి వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశులు అనే రైతు.. ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. అయితే హఠాత్తుగా ఓ ఎలుగుబంటి.. రైతుపై దాడి చేసింది. ఒక్కసారిగా ఎలుగుబంటి రావడంతో వెంకటేశులు భయభ్రాంతులకు గురయ్యాడు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.
అప్పటికే వెంకటేశులుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఎలాగోలా ఎలుగుబంటి నుంచి తప్పించుకుని గ్రామానికి చేరుకున్న రైతును.. స్థానికులు, కుటుంబసభ్యులు కలిసి కళ్యాణదుర్గం నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించారు. తల, భుజాలపై గాయాలవడంతో వైద్యులు అతడికి చికిత్స అందజేశారు. దాదాపు 40కి పైగా కుట్లు వేశారు. అయితే ఎలుగుబంట్ల సంచారంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల బారి నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
జగన్ హయాంలో వెలిగొండ నిర్వాసితులను మోసం, దగా చేశారు: మంత్రి నిమ్మల
ముస్లిం సోదరులకు 'మిలాద్-ఉన్-నబీ' శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News