అమెరికాలో అనంత టెకీ మృతి
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:04 AM
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు నిస్సార్ షేక్ అహ్మద్ (34) దుర్మరణం చెందారు. ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని లిటిల్ రాక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
ట్రక్కును కారు ఢీకొనడంతో విషాదం
మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు
అనంతపురం క్రైం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు నిస్సార్ షేక్ అహ్మద్ (34) దుర్మరణం చెందారు. ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని లిటిల్ రాక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నిస్సార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఓహియోలోని ప్రముఖ కెంట్ స్టేట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆర్కాన్సాస్ రాష్ట్రంలో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. స్నేహితుడిని కలిసేందుకు కారులో వెళ్తూ.. ప్రమాదవశాత్తు ట్రక్కును ఢీకొట్టారు. దీంతో నిస్సార్ అక్కడికక్కడే మరణించారు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన కొడుకు విగతజీవిగా మారాడనే సమాచారం తెలియడంతో అనంతపురంలోని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. లిటిల్ రాక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిస్సార్ అకాల మరణం పట్ల అమెరికాలోని ప్రవాస భారతీయ సంఘాలు, తెలుగు అసోసియేషన్లు సంతాపం తెలిపాయి. మృతదేహాన్ని అనంతపురానికి తరలించేందుకు మిత్రులు, స్వచ్ఛంద సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవలే ఆయన తండ్రి షేక్ సైఫుద్దీన్‌కు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఆయన కుమారుడు దూరం కావడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఈ వార్తలను కూడా చదవండి
సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు