అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - May 23 , 2026 | 08:45 AM
అనకాపల్లి జిల్లాలోని కసింకోట మండలంలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి, మే 23: జిల్లాలోని కసింకోట మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉగ్గినాపాలెం పరిధిలోని తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ మహీంద్ర వాహనం.. ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహీంద్ర వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మునగపాక మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు.. మహీంద్ర వాహనంలో భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. స్వామివారి దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా.. కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహీంద్ర వాహనం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే కసింకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు మునగపాక మండలానికి చెందిన ఆడారి కూర్మారావు (42), జ్యోతి (31)గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News