అమరావతిలో ఫిబ్రవరి 3 నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్: చంద్రబాబు
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:23 AM
అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఫిబ్రవరి 3 నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్
క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు ఎగుమతి చేస్తాం
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోనూ ఐఐటీ సిలబస్ అమలు
ఇకపై ఏటా ఇలాంటి సదస్సులు నిర్వహించుకుందాం
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలు చేరడంలో సహకరించండి
పాన్ ఐఐటీ సమ్మిట్‌లో కోరిన సీఎం చంద్రబాబు
వాటర్ గ్రిడ్ ఉంటే మన దేశానికి ఎదురులేదు. గంగా, కావేరి నదులు కలిస్తే నీటి కరువు తీరిపోతుంది. రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండవు. గతంలో నన్ను హైటెక్ సీఎం, సీఈవో సీఎం అని పిలిచేవారు ఇప్పుడు వాటర్ మ్యాన్ అని పిలుస్తున్నారు. గంగా- కావేరి అనుసంధానమైతే నా లక్ష్యం నెరవేరినట్టే.
- సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం విజయవాడ అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన పాన్ ఐఐటీ సమ్మిట్-2026కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘ఇప్పుడు సిలికాన్ వ్యాలీ గురించి కాదు అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం చర్చించుకుంటోంది. 156 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ వచ్చేలోగానే ఇక్కడ క్వాంటం టెస్ట్‌బెడ్లు పని చేస్తున్నాయి. క్యు-శివ లాంటి మినీ క్యాంటం టెస్ట్ ల్యాబ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటాం’ అని తెలిపారు. పాన్ ఐఐటీ సమ్మిట్ ద్వారా అత్యుత్తమ మేధస్సు కలిగిన ఐఐటియన్లతో ఎక్కువ సమయం గడపటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవడంలో సహకరించాలని వారిని కోరారు. అంతర్జాతీయ టెక్ కంపెనీలకు భారతీయులే నేతృత్వం వహిస్తున్నారని, నాడు ఐటీని ప్రోత్సహించినందుకే ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులుగా మన తెలుగువారు ఉన్నారని సీఎం తెలిపారు.
క్లస్టర్ల ఎకో సిస్టమ్‌కు ప్రోత్సాహం
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఎలకా్ట్రనిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ క్లస్టర్ల ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అనంతపురం, కొప్పర్తి, తిరుపతి సహా పలు ప్రాంతాల్లో ఈ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ‘సైబరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నెట్ జీరో, గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్ వినియోగంతో రాజధాని నిర్మాణం చేపడుతున్నాం. ఐదు లక్షల మంది ఐఐటియన్ల మేధస్సుతో అమరావతి గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుతుంది. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఐఐటీ సిలబస్ అందిపుచ్చుకుంటే విద్యార్థుల నైపుణ్యం మరింత పెరుగుతుంది. ఐఐటీ తరహా ల్యాబ్‌లు ఇక్కడి విద్యాసంస్థల్లో ఏర్పాటు కావాలి. అవసరమైతే 50శాతం ఫీజు ప్రభుత్వం భరిస్తుంది. విద్యార్థులకు ఆరో తరగతి నుంచే పారిశ్రామిక నైపుణ్యాలు నేర్పించే ఆలోచన చేస్తున్నాం. ఇకపై ఏటా పాన్ ఐఐటీ సమ్మిట్ నిర్వహించి, వివిధ అంశాలపై చర్చించుకుందాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: