అందరి భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:02 AM
నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరిపాలన సాగుతోంది. ఒక్క ప్రభుత్వం ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం కాదు. ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలి. స్వర్ణ భారత్ ట్రస్టు గడిచిన పాతికేళ్లుగా ఇదే మార్గంలో పయనిస్తోంది’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సంకల్పంతో పనిచేయాలి
స్వర్ణభారత్ ట్రస్ట్ ఇదే మార్గంలో పయనిస్తోంది
ఏపీ, యూపీ మధ్య సాంస్కృతిక సంబంధం: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
నా ఆస్తులన్నీ స్వర్ణ భారత్ ట్రస్టుకే: వెంకయ్యనాయుడు
నెల్లూరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరిపాలన సాగుతోంది. ఒక్క ప్రభుత్వం ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం కాదు. ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలి. స్వర్ణ భారత్ ట్రస్టు గడిచిన పాతికేళ్లుగా ఇదే మార్గంలో పయనిస్తోంది’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన సోమవారం నెల్లూరు జిల్లాకు వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వెంకటాచలం మండలం సరస్వతీ నగర్‌లోని అక్షర విద్యాలయానికి చేరుకున్న యోగికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత సోమా నైపుణ్య కేంద్రాన్ని, తర్వాత అక్షర విద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు చేరుకొని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో కలసి రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. ‘‘సరిగ్గా 25 సంవత్సరాల క్రితం దేశ గతిని మార్చే యాత్రలో భాగంగా నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో వెంకయ్యనాయుడు మార్గదర్శకంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ యాత్ర మొదలైంది. ఈ రెండు యాత్రల లక్ష్యం ఒకటే. అది వికసిత్ భారత్. యువత ఏ దేశం వెళ్లినా ‘నా దేశం-భారత దేశం’ అన్న భావన కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాలైనా ఈ రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు అజాత శత్రువు. ఆయన రాజకీయ నాయకుడిగానే కాకుండా ఉత్తర, దక్షిణ భారతాలకు సాంస్కృతిక వారధిగా పనిచేశారు’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ట్రస్టు నా మానస పుత్రిక: వెంకయ్య
‘నాకు ఇద్దరు బిడ్డలు కాదు.. ముగ్గురు. నా కొడుకు, కూతురితో పాటు నా మానస పుత్రిక స్వర్ణ భారత్ ట్రస్ట్. గ్రామీణ భారతం పురోగమించినప్పుడే సమగ్ర దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న లక్ష్యంతోనే ఈ ట్రస్ట్‌ను నెలకొల్పాం. నాకు 77 ఏళ్లు నిండాయి. ఈ మధ్యనే ఒక లేఖ రాశాను. నా తదనంతరం నా అకౌంట్లోని డబ్బులు, నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ స్వర్ణ భారత్ ట్రస్టుకే చెందుతాయి. నేనుండగా నా బిడ్డలు రాజకీయాల్లోకి రారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడాలని వారికి సూచించా. నాపై చూపిన ప్రేమనే భవిష్యత్‌లో కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్‌లపైన చూపించాలి. ప్రజాసేవలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. యూపీ సీఎంని, వెంకయ్యతో పాటు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, వై సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి
స్పృహ తప్పిన వృద్ధుడికి ఏఎస్‌ఐ సేవలు