లచ్చప్ప మాస్టారు..
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:58 PM
లచ్చప్ప మాస్టారు..
పాఠశాలే ఆయన ఇల్ల్లు, విద్యార్థులే పిల్లలు
ఉదయం అక్కడే పాఠాలు.. తరగతిలోనే రాత్రి నిద్ర
నిధులు లేక ఆగిన సూగురు పాఠశాల భవనాలు
రూ.23 లక్షల సొంత డబ్బుతో పూర్తి
ఆదర్శంగా నిలుస్తున్న సూగూరు పాఠశాల హెచ్‌ఎం
లచ్చప్ప.. ఓ సాధారణ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. రాష్ట్ర సరిహద్దున ఉండే సూగూరు గ్రామ పాఠశాలలో ఆయన పనిచేస్తున్నారు. నెలకు రూ.1.50 లక్షల జీతం. ఆయనకు వచ్చే జీతానికి ఆనంద జీవితాన్నే గడపవచ్చు. కానీ ఆయన విలాసానికి పోలేదు. వివాహం చేసుకోలేదు. పాఠశాల పిల్లలే తన పిల్లలుగా భావించాడు. విద్యార్థుల కోసం 24 గంటలు పరితపిస్తున్నాడు. అందుకేనేమో 24 గంటల పాటు పాఠశాలలోనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పాఠాలు బోధిస్తారు. రాత్రి పది గంటల వరకు ట్యూషన్ పేరుతో విద్యార్థులకు పాఠ్యాంశాల్లోని సందేహాలను నివృత్తి చేస్తుంటారు. ఆపై పాఠశాల తరగతి గదిలోనే నిద్రపోతారు. ఇలా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాఠాలు బోధిస్తూ ఆపై పాఠశాలలోనే నిద్రిస్తారు. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనమే ఆయనకు రాత్రి భోజనం కూడా. ‘ఏం సార్ ఇలా..’ అని అడిగితే ‘నాకేం కోరికలు లేవు. విలాసవంతమైన జీవితమూ అక్కర్లేదు. నా పాఠశాల పిల్లలే నా కుటుంబం. నా పాఠశాలే నా ఇల్లు. ఇదే నా జీవితం..’ అంటూ సమాధానమిస్తారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని కొనసాగించే ఆయన పిల్లల కోసం నిధులు లేక ఆగిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులను పునఃప్రారంభించాడు. తన సొంత నిధులను రూ.23 లక్షలను వెచ్చించి ఏకంగా పాఠశాల గదులను పూర్తి చేయించాడు. మొత్తం మీద ఆయన సంపద విద్యార్థులు. పాఠశాలే ఇళ్లు. అత్యంత అరుదుగా కనిపించే ఉపాధ్యాయుడు లచ్చప్పపై ఆంధ్రజ్యోతి ఆదర్శ కథనం.
- మంత్రాలయం (ఆంధ్రజ్యోతి)
మంత్రాలయం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పాఠశాల భవన నిర్మాణం ఆగిపోతే ఏం చేస్తారు.. నిధులొచ్చే దాకా అలాగే వదిలేస్తారు. అయితే ఆ హెడ్ మాస్టారుకు మాత్రం మనసు ఒప్పలేదు. ఎలాగైనా ఆ గదులను పూర్తి చేయాలన్న తపనతో సొంతంగా రూ.23 లక్షలు ఖర్చు చేశారు. అది కూడా పాఠశాలలోనే భోజనం తింటూ.. అక్కడే నివాసం ఉంటూ కఠోర దీక్షతో పనులు ముగించారు. దీంతో హెచ్‌ఎం లచ్చప్ప.. మా మంచి మాస్టార్ అంటూ గ్రామస్థుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. హోటల్ భోజనం కూడా దొరకని మారుమూల గ్రామం సూగూరు. అక్కడి విద్యార్థుల భవిష్యత్తే తన లక్ష్యంగా గ్రామంలోని పాఠశాల గదిలోనే ఉంటూ సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్నం భోజనం తింటూ నేలపైనే పడుకుంటూ గత ఏడాదిగా నిలిచిపోయిన నూతన పాఠశాల భవనాలను తన సొంతంగా రూ.23 లక్షలు ఖర్చుచేసి సోమవారం ప్రారంభానికి సిద్ధం చేశారు హెచ్‌ఎం లచ్చప్ప. మంత్రాలయం మండలంలోని సూగూరు ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా 2017లో పదోన్నతి కల్పించారు. అయితే అదే ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలకు రెండు గదులు కేటాయించి తరగతులు నిర్వహిస్తున్నారు. చెట్లకింద, గోడల చాటున తరగతులను నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. 2022లో జగన్ ప్రభుత్వంలో నాడు-నేడు రెండో విడతలో రూ.2.02కోట్లు నిధులతో 12 గదుల నిర్మాణానికి అప్పటి హెచ్‌ఎం హరికృష్ణప్రసాద్ స్థలాన్ని సిద్ధం చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఆ భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సాధారణ బదిలీలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన లచ్చప్ప గ్రేడ్-2 హెచ్‌ఎంగా బాధ్యతలు చేపట్టారు. పాఠశాలకు ఉన్న రెండు గదుల్లో 5తరగతులు ఎలా నిర్వహించాలని తపన పడుతూ ఉన్నత అధికారులకు నివేదికలు పంపుతూ ప్రయత్నం చేశారు. అభివృద్ధి పనులు నిలిచిపోకూడదన్న తపనతో తన జీతంలో నుంచి దాదాపు రూ.23లక్షలు సొంతంగా ఖర్చుచేసి మధ్యలో ఆగిపోయిన భవనాలకు మరమ్మతులు, విద్యుత్, వంటగది, బాలికలకు మరుగుదొడ్లు , తాగునీటి సౌకర్యం, పాఠశాల మైదానం కోసం గ్రావెల్, నీటినిల్వకోసం సంపు, మొదటి అంతస్తులో మూడు భవనాలకు స్లాబు, ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. ఈ పాఠశాలలో 350 విద్యార్థులు, 11 మంది ఉపాధ్యాయులు, 6-10 తరగతులు విద్యాభోధన సాగుతోంది.
ఆదర్శప్రాయం ఉపాధ్యాయుడి ప్రస్థానం
లచ్చప్ప 2002లో స్కూల్ అసిస్టెంట్‌గా బేతంచర్ల మండలంలో ఉపాధ్యాయుడిగా చేరారు. 2023 జూన్ 8న సూగూరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా బాధ్యతలు చేపట్టారు. తన జీవితాన్నే పాఠశాల, విద్యార్థుల కోసం త్యాగంచేసి మధ్యాహ్న భోజనంతోనే క డుపు నింపుకుంటూ పాఠశాల భవనాలను పూర్తి చేశారు. ఆయన కఠోర దీక్షకు గ్రామస్థులు సైతం ప్రోత్సహిస్తూ సహకరించారు. ఒక అవివాహితుడిగా వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి లక్ష్మీదేవితో ఎమ్మిగనూరు పట్టణంలో ఉంటూ రోజు పాఠశాలకు వచ్చేవారు. పాఠశాల పరిస్థితిని తల్లికి చెప్పి ఆమెను అన్న దగ్గర చేర్చి సూగూరు గ్రామంలో నివాసం మార్చారు. నెలకు రూ.1.35 లక్షలు జీతం తీసుకుంటూ సాధారణ పాఠశాల గదిలో నేలపై పడుకుంటూ పాఠశాల గదులను పూర్తిచేసి పాఠశాల కమిటీ సభ్యులచేత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈకష్టాన్ని చూసిన గ్రామస్థులు గురువంటే ఇలా ఉండాలి.. శభాష్ మాస్టారు అంటూ మెచ్చుకుంటున్నారు.
ఇలాంటి సార్ దొరకడం మా అదృష్టం
రాత్రి, పగలు తేడా లేకుండా మాకు విద్యాబోధనకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఇలాంటి సారు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. ఒకే గదిలో రెండు తరగతులు పాఠాలు చెప్తే అర్థంకాక ఇబ్బందులు పడేవాళ్లం. మాతో పాటు తింటూ మాతోనే నేలపైనే పడుకునేవారు. సార్ ఇచ్చిన శిక్షణతో పదో తరగతిలో మంచి మార్కులతో పాసు అవుతాను.
నరేష్, 10వ తరగతి, విద్యార్థి, సూగూరు
కొత్త పాఠశాలకు వెళ్లడం ఆనందంగా ఉంది
పాఠశాలలో గదులు, నీరు, ప్రహరీ కొరతగా ఉండేది. హెచ్‌ఎం లచ్చప్ప సారు కష్టపడి కొత్తగా పాఠశాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ కొత్త పాఠశాలలో డెస్కులు, ఫ్యాన్‌లు, లైట్లు ఉన్నాయి. ఎల్‌ఈడీ స్కీన్‌తో విద్యాబోధన చేస్తారు. విశాలమైన ఆట మైదానం చూస్తుంటే సంతోషంగా ఉంది.
దీక్షిత, 8వ తరగతి విద్యార్థిని, సూగూరు
ఙమా పిల్లలకు ఎంతో మేలు చేశారు
మాఊర్లోనే ఉండి మాపిల్లల భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. లచ్చప్ప సారు స్కూల్‌లోనే నివాసం ఉంటూ మాపిల్లలకు రాత్రి 10వరకు చదివిస్తూ సందేహాలు చెప్పి శిక్షణ ఇస్తుండడం పిల్లలకు ఎంతో మేలు. ఇలాంటి సార్‌ను నాజీవితంలో చూడలేదు. ఏడాదిగా పిల్లలకు పెట్టే అన్నం తింటూ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించారు. ఇలాంటి సారుకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.
రాముడు, సూగూరు
విద్యార్థుల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నా
కె.లచ్చప్ప, హెచ్‌ఎం, సూగూరు
సూగూరు ప్రాథమిక పాఠశాల నుంచి జడ్పీ పాఠశాలలోకి మార్చేందుకు సూగూరులోనే నివాసం ఉండాల్సి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు నా సొంత ఖర్చులతో అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాలను నిర్మించేందుకు చాలా కష్టపడ్డాను. గ్రామస్తుల సహకారంతో ఈభవనం ప్రాంభానికి వచ్చింది. విద్యార్థులకు మంచి విద్యాభోదన చేసేందుకు 11 మంది ఉపాధ్యాయులు శ్రద్ధ చూపిస్తుండటంతో నా లక్ష్యం నెరవేరుతుంది.
నూతన పాఠశాల భవనాలు ప్రారంభం
మంత్రాలయం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని ఎంఈవో రాగన్న అన్నారు. సోమవారం మంత్రాలయం మండలంలోని సూగూరు జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనాలను హెచ్‌ఎం లచ్చప్ప, విద్యాకమిటీ చైర్మెన్ చిన్న హనుమంతు, వైస్ చైర్మెన్ లక్ష్మీ ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడతూ హెచ్‌ఎం లచ్చప్ప సొంత డబ్బు ఖర్చు చేసి భవనాల రూపురేఖలు మార్చడానికి అహర్నిశలు కృషి చేశాడని అన్నారు. ఇలాంటి ప్రధానోపాధ్యాయుడు గ్రామానికి రావడం విద్యార్థుల, తల్లిదండ్రుల అదృష్టమన్నారు. అనంతరం గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు ఎస్‌పీ భాస్కర్‌రెడ్డి, ఎల్‌ఎల్‌సీ కాలువ చైర్మెన్ నరసింహులు, గోపాల్, రవి, ఉపాధ్యాయులు రవి, నాగరాజు, లోకనాథ్, నస్రీన్, సోమన్న, తాయమ్మ, బడేసాబ్, గోపి, పుష్ప, చిన్నతిమ్మన్న, మదర్‌బీ, రేణుక తదితరులు పాల్గొన్నారు.