Share News

టీచర్లకు తిరుగులేదు

ABN , Publish Date - Sep 06 , 2026 | 04:37 AM

విద్యార్థుల భవిష్యత్తు నిర్మాతలు ఉపాధ్యాయులేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఏఐ వచ్చినా వారికి ప్రత్యామ్నాయం లేదని, టీచర్ల స్థానం భర్తీ కాలేనిదని అన్నారు.

టీచర్లకు తిరుగులేదు

  • ఏఐ వచ్చినా.. వారి స్థానం భర్తీ కాదు: సీఎం

  • మరో మూడు డీఎస్సీలు2029లోగా వాటిని పూర్తిచేస్తాం

  • 14 డీఎస్సీల ద్వారా 2 లక్షల టీచర్లను నియమించిన ఘనత చంద్రబాబుది

  • వర్సిటీల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం

  • ఏప్రిల్‌ నాటికి ఫ్యాకల్టీ నియామకాలు పూర్తి

  • ఉపాధ్యాయ దినోత్సవంలో లోకేశ్‌ వెల్లడి

  • విద్యార్థుల భవిష్యత్తు నిర్మాతలు ఉపాధ్యాయులే

  • విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలి

  • నూతన టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన

  • 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత లక్ష్యం

  • ఏపీ విద్యా విధానం దేశానికే ఆదర్శం కావాలి

  • గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • 175 మంది ఉత్తమ టీచర్లకు అవార్డుల ప్రదానం

  • పాఠశాలలకు ప్రత్యేక బ్రాండ్‌ తేవాలని ఆకాంక్ష


అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తు నిర్మాతలు ఉపాధ్యాయులేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఏఐ వచ్చినా వారికి ప్రత్యామ్నాయం లేదని, టీచర్ల స్థానం భర్తీ కాలేనిదని అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విప్లవంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఏఐ, క్వాంటం, రోబోటిక్స్‌, డేటా అనలటిక్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఎనర్జీ వంటి రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించడం అందరి కర్తవ్యం కావాలని, ఏడో తరగతి చదివే విద్యార్థి సైతం ఏఐలో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్య కేవలం థియరీకి పరిమితం కాకూడదని, బోధన ప్రాక్టికల్‌గా ఉండాలన్నారు. ‘ఏపీ మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌’ దేశానికే ఆదర్శం కావాలని, ఇందుకోసం లక్ష్యం పెట్టుకొని పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలలకు ప్రత్యేక బ్రాండ్‌ తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘‘తల్లిదండ్రులు జన్మనిస్తే.. సరైన దిశానిర్దేశం చేసేది గురువులే. అందుకే గురువులను జీవితంలో మర్చిపోలేం. విద్యార్థులపై వారి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీ వల్ల మంచి, చెడూ రెండూ ఉన్నాయి. టెక్నాలజీ వల్ల కొత్త అవకాశాలు రావడంతో పాటు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పుడు జెన్‌జీ, జెన్‌ ఆల్ఫా, అండర్‌-18 గురించి మాట్లాడుకుంటున్నాం. పిల్లలను కొట్టడం సంగతి పక్కనబెడితే.. గట్టిగా అరిచినా సమస్యలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను చంపేశారు.


విజయనగరంలో ఓ పిల్లవాడు తల్లినే చంపేశాడు. రంపచోడవరంలో జరిగిన మీటింగ్‌లో నా పక్కనే కూర్చుని ఉత్సాహంగా మాట్లాడిన ఓ బాలిక ఆ తర్వాత మూడో రోజు ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నంలో ఓ టీచర్‌ హోంవర్క్‌ చేయలేదని ఓ దెబ్బ కొట్టగానే ఆరేళ్ల బాలుడు షాక్‌తో ప్రాణాలు విడిచాడు. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో విద్యాబోధన ఉపాధ్యాయులకు ఓ సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీచర్లు సున్నితంగా వ్యవహరించాలి. విద్యార్థులకు నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, దేశభక్తి, ప్రకృతిని ప్రేమించడం, పెద్దలను పూజించడం, మహిళలను గౌరవించడం వంటివి విద్యలో భాగం కావాలి. అందుకే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో విద్యార్థులకు నైతిక విలువల ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై మరింత పెరిగింది. ఇష్టపడి చదువుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాల మోడల్‌ స్కూల్‌గా మారితే.. తద్వారా కుటుంబాలు, గ్రామాలు, చివరకు దేశమే మారిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలతో వచ్చే 10-15 ఏళ్లలో విభిన్నమైన భారతదేశాన్ని చూడబోతున్నాం. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటే.. స్వర్ణాంధ్రప్రదేశ్‌ దేశంలో నెంబర్‌ వన్‌గా ఉండాలి. ఇందుకు పాఠశాలల్లోనే పునాది పడాలి. భారతదేశం మళ్లీ విశ్వగురు స్థానానికి తీసుకురావడం ఉపాధ్యాయుల వల్లే సాధ్యం. విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

175 మంది ఉత్తమ టీచర్లకు సత్కారం

గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌లు సత్కరించారు. వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎం.పద్మనాభం అనే దివ్యాంగ ఉపాధ్యాయుడిని సత్కరించేందుకు చంద్రబాబు, లోకేశ్‌లు వేదిక దిగి వెళ్లడం గమనార్హం. అంతకుముందు వేదిక వద్ద విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. మంత్రి లోకేశ్‌, అధికారులను అభినందించారు.


ఈ వార్తలను కూడా చదవండి

ఉపాధ్యాయుల సేవలు అమూల్యం

బొబ్బిలిలో బాలఏసు విగ్రహం కూల్చివేత

Updated Date - Sep 06 , 2026 | 04:46 AM