Share News

అక్రమాస్తుల పుట్ట టీటీడీ డిప్యూటీ ఈవో

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:59 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మెండు లోకనాథం పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారు. పవిత్రమైన ప్రదేశంలో కీలకమైన స్థానంలో ఉండి భారీగా ఆస్తులు పోగేశారు.

అక్రమాస్తుల పుట్ట టీటీడీ డిప్యూటీ ఈవో

  • ఆస్తులపై ఏసీబీ గురి

  • ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో తనిఖీలు

  • రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

  • భార్య, కుమారుడి పేర్లతో ఇళ్లు, స్థలాలు

  • 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి లభ్యం

  • నేడూ కొనసాగనున్న సోదాలు

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మెండు లోకనాథం పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారు. పవిత్రమైన ప్రదేశంలో కీలకమైన స్థానంలో ఉండి భారీగా ఆస్తులు పోగేశారు. ఆదాయానికి మించి కొన్న ఆ ఆస్తులపై పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం రంగంలోకి దిగింది. ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి లోకనాథం అక్రమాస్తుల లెక్క తీస్తోంది. తిరుపతి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 20 మంది సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి బుధవారం తనిఖీలు ప్రారంభించారు. తిరుపతి, తిరుమల, ఏర్పేడు మండలంలోని లోకనాథం స్వగ్రామం చెల్లూరు ప్రాంతాల్లో ఆయనకు చెందిన, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తుల వివరాలను విజయవాడలోని ఏసీబీ సెంట్రల్‌ కార్యాలయం వెల్లడించింది.


భార్య, కుమారుడి పేర్లతో ఆస్తులు

తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని ఇంటిని లోకనాథం భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే తిరుపతి నగరంలోని గొల్లవానిగుంటలో రెండు ఇళ్ల స్థలాలతో పాటు భవనాలు కూడా భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలో ఇంటి స్థలం, తిరుపతి అర్బన్‌ పరిధిలోని శ్రీనివాసనగర్‌ ప్రాంతంలో మరో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. తిరుపతి శ్రీనివాసనగర్‌లోని స్థలాన్ని కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. అలాగే లోకనాథం, ఆయన కుమారుడి పేర్లపై నాలుగు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కూడా ఉన్నాయి. లోకనాథం భార్య తోబుట్టువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ రూ. 31.98 లక్షల విలువైన ఆస్తికి సంబంధించిన పత్రాన్ని ఏసీబీ గుర్తించింది. అలాగే 2 కిలోల బంగారం, రూ. 12.50 లక్షల నగదు, 6.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు ఏసీబీ పేర్కొంది.


కల్తీ నెయ్యి వ్యవహారంలో హస్తం

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. టీటీడీలోని కొందరు ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని గుర్తించింది. వారి వివరాలను ఏసీబీకి అందజేసింది. ఆ జాబితాలో లోకనాథం పేరుండటంతో ఆధారాలను సేకరించిన అనంతరం ఏసీబీ రంగంలోకి దిగింది. అంతకుముందు ఇదే వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కె. చిన్నఅప్పన్నపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ప్రాథమిక ఆధారాల మేరకే సోదాలు..

తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గురువారం కూడా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని, అవి పూర్తయిన తరువాతే అక్రమ ఆస్తులు ఎంతమేరకు ఉన్నాయన్నది చెప్పగలమని అన్నారు. లోకనాథంపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రాథమిక ఆధారాల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్‌ వారెంట్లు పొందిన అనంతరమే ఈ సోదాలు చేపట్టినట్లు వివరించారు.

జాబితాలో ఇంకెవరు ఉన్నారో?

డిప్యూటీ ఈవో లోకనాథం ఆస్తులపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో టీటీడీలో కలకలం రేగింది. ఈవో, అదనపు ఈవో తర్వాత ఆ స్థాయిలో కీలకమైన బాధ్యత తిరుమల డిప్యూటీ ఈవోదే. ప్రముఖులు శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో ఉన్నతాధికారులతో పాటు తప్పనిసరిగా డిప్యూటీ ఈవో కూడా ఉంటారు. ఇలాంటి స్థాయి అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు చేయడంతో ఇంకా ఎవరెవరిపై దాడులు జరుగుతాయోనని ఆందోళనలో ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:59 AM