ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:56 AM
ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌కు భారీ జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నోటీసులు జారీ చేసింది. పీసీబీ నిర్దేశించిన మార్గదర్శకాలు, పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తూ, లోపాలను సరిదిద్దడంలో విఫలమైందని పేర్కొంటూ రూ.21.01 కోట్ల పర్యావరణ పరిహారం విధించింది.
కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌కు భారీ జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నోటీసులు జారీ చేసింది. పీసీబీ నిర్దేశించిన మార్గదర్శకాలు, పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తూ, లోపాలను సరిదిద్దడంలో విఫలమైందని పేర్కొంటూ రూ.21.01 కోట్ల పర్యావరణ పరిహారం విధించింది. ఈ మేరకు పీసీబీ మెంబర్ సెక్రటరీ ఎస్. శ్రీశరవణన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 2026 మే 26న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తూర్పులంక ఇసుక మేటలు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తించిన పర్యావరణ ఉల్లంఘనలపై ఏపీపీబీసీ మే 28, జూన్ 12న ఆంధ్రా పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీజులు జారీ చేసింది. ఆంధ్రా పేపర్ మిల్లు విడుదల చేసే వ్యర్థాలతో గోదావరి నదీ పరిసర ప్రాంతాలు కాలుష్యమయంగా మారడంపై సత్వరం స్పందించాలని ఆదేశించాం. సెప్టెంబరు 3న నిర్వహించిన తాజా తనిఖీల్లోనూ పరిస్థితిలో పెద్దగా మార్పు కానరాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలన అనంతరం జారీ చేసిన నోటీసులు, కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన సమీక్షలు, పలుమార్లు ఇచ్చిన ఆదేశాలు, అవకాశాల అనంతరం కూడా నిబంధనల అమలులో పురోగతి లేకపోవడాన్ని ఏపీపీసీబీ తీవ్రంగా పరిగణిస్తోంది. పర్యావరణంపై, ముఖ్యంగా గోదావరి నది పరిసరాల్లో వ్యర్థాలను విడుదల చేసి ప్రతికూల చర్యలకు పాల్పడడాన్ని అనుమతించబోమని స్పష్టం చేయడంతోపాటు నిబంధనలు, బోర్డు ఆదేశాలను ఉల్లంఘించినందున ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌కు రూ.21కోట్ల ఒక లక్షా 80వేలు పర్యావరణ పరిహారంగా విధిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఉపేక్షించేది లేదు: మంత్రి దుర్గేశ్
కాలుష్య నియంత్రణ విషయంలో ఇప్పటికే పేపరు మిల్లుకు తగినంత సమయం ఇచ్చినా యాజమాన్యం చర్యలు తీసుకోలేదని, అవసరమైతే ప్రజా ఉద్యమానికి తామే నాయకత్వం వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా పేపర్ మిల్లు కాలుష్య సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. పన్నులు చెల్లించక పోవడం, కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడంపై కూడా ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలతో ఆడుకుంటామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
ప్రజా సమస్యలపై సానుకూలంగా వ్యవహరించండి