ఖరీఫ్ కష్టాలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:17 AM
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ సాగును అడ్డంకిగా మారాయి. సాధారణ స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగు ఆశించిన స్థాయిలో లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాపై ఎల్‌నినో ప్రభావం
484.4 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 229.3 మిల్లీమీటర్లే నమోదు
15లోగా వర్షాలు కురవకుంటే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక
అపరాలు, చిరుధాన్యాల విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ సాగును అడ్డంకిగా మారాయి. సాధారణ స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగు ఆశించిన స్థాయిలో లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు మరింత ఆలస్యమైతే పంట నష్టాన్ని కొంతమేర తగ్గించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని పక్షంలో 15,010 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని అధికారులు నిర్ణయించారు.
జిల్లాలో వాస్తవానికి ఇప్పటి వరకు 484.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 229.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే సాధారణ వర్షపాతంలో సగానికి కూడా చేరని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మొత్తం 24 మండలాల్లో ఏడు మండలాల్లో అత్యల్ప వర్షపాతం, మరో 17 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో మెట్ట, వర్షాధార ప్రాంతాల్లో సాగు పనులు ముందుకు సాగలేదు.
వరి సాగుకు నీటి కొరత
జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,329 హెక్టార్లు అయితే ఇప్పటివరకు కేవలం 14,068 హెక్టార్లలోనే వరి సాగు నమోదైంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సాగు గణనీయంగా వెనుకబడింది. సకాలంలో వర్షాలు లేకపోవడం, నీటి వనరుల్లో ఆశించిన స్థాయిలో లేకపోవడమే దీనికి కారణం. మరోవైపు వర్షాలపై ఆధారపడి నాట్లు వేసేందుకు సిద్ధమైన రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.
15 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ సాగు
వర్షాలు మరింత ఆలస్యమైతే వరి సాగు సాధ్యం కాని ప్రాంతాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించేందుకు అధకారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 15వ తేదీ వరకు వర్షాలు నమోదు కాకపోతే 15,010 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు. తక్కువ నీటితో సాగు సాధ్యమయ్యే అపరాలు, చిరుధాన్యాల వైపు రైతులను మళ్లించనున్నారు.
2,229 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచేలా..
ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సమకూర్చుకునే చర్యలు చేపట్టారు. మొత్తం 2,229 క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఇప్పటికే 467.5 క్వింటాళ్ల విత్తనాలను ఏపీ సీడ్స్ గోదాముల్లో సరఫరాకు సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి మిగిలిన విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.