5 రోజుల్లోనే ఇల్లు రెడీ!
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:56 AM
ఓ చిన్నపాటి ఇల్లు నిర్మించాలన్నా.. కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే తక్కువ ఖర్చుతో, కేవలం 5 రోజుల్లోనే ఇల్లు నిర్మించే...
త్రీడీ కాంక్రీట్ విధానంలో నిర్మాణం
అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి
తక్కువ ఖర్చుతో శరవేగంగా పనులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఓ చిన్నపాటి ఇల్లు నిర్మించాలన్నా.. కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే తక్కువ ఖర్చుతో, కేవలం 5 రోజుల్లోనే ఇల్లు నిర్మించే అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అదే ‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్’. ఈ విధానంతో కూటమి ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్మించనుంది. ప్రస్తుత సంప్రదాయ పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణానికి ఇటుకలు, ఇసుక, సిమెంట్‌తో పాటు ఎక్కువ మంది కార్మికులు, సెంట్రింగ్ పరికరాలు, సపోర్టింగ్ లంబాలు చాలా అవసరం. పైగా ఒక్కో ఇంటి నిర్మాణానికి కొన్ని నెలల సమయం పడుతోంది. దీంతో నిర్మాణ జాప్యాన్ని నివారించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనుంది. ఫలితంగా అతి తక్కువ ఖర్చుతో శరవేగంగా పేదలకు నాణ్యమైన పక్కా ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. రెండు రోజుల కిందట ఢిల్లీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శక్తికాంత్ సింగ్ వచ్చి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నుంచి శాస్త్రవేత్తల బృందం వచ్చి.. బుర్రిపాలెంలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేశారు. భౌగోళిక పరిస్థితులు, మెటీరియల్ లభ్యత పరిశీలించారు. అనంతరం, ప్రాజెక్టు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ విజయవంతమైతే ఈ టెక్నాలజీతో రాష్ట్రమంతా పేదల ఇళ్లు నిర్మించనున్నారు.
‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్’ అంటే?
ప్రపంచంలోని అనేక దేశాల్లో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్‌లో వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ అవసరాలకు అనుగుణంగా సీఎస్ఐర్-సీబీఆర్‌ఐ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో గ్రాంటీ రోబోట్‌తో ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసే ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఒక పెద్ద పారిశ్రామిక డెస్క్‌టాప్ 3డీ ప్రింటర్‌గా పని చేస్తుంది. ఇంటి గోడలు, మాడ్యులర్ బిల్డింగ్ భాగాలు, ల్యాండ్ మార్క్ హౌసింగ్ యూనిట్లను కూడా ప్రింట్ చేస్తుంది. ఈ విధానంలో ముందుగా కంప్యూటర్‌లోనే ఇంటి డిజైన్‌ను సిద్ధం చేస్తారు. ఆ డిజైన్‌ను ప్రత్యేకమైన గాంట్రీ రోబోట్ అనే యంత్రానికి పంపిస్తారు. రోబోట్ కంప్యూటర్‌లో ఇచ్చిన కమాండ్స్(ఆదేశాలు) ప్రకారం కాంక్రీట్ బ్లాకులను వేస్తూ ఇంటి గోడలను నిర్మిస్తుంది. మొత్తంగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే గాంట్రీ రోబోట్ నిర్మాణ స్థలాల్లో పనిచేయడానికి తగినట్లుగా ఒక ద్రుఢమైన పోర్టల్ మాదిరి పెద్ద ఫ్రేమ్‌లా ఉంటుంది. దానిపై ప్రత్యేకమైన ప్రింటర్ హెడ్ అమర్చి ఉంటుంది. ఈ యంత్రంలో నిర్దేశిత మోతాదుల్లో సిమెంట్, బగాసే యాష్, ఫ్లైయాష్, ఇసుక, నీరు, సూపర్ ప్లాస్టిక్ సీజర్ తదితర మెటీరియల్స్ వేస్తారు. దాంతో ప్రత్యేకంగా తయారు చేసిన కాంక్రీట్ మిశ్రమం బయటకు వస్తుంది. కంప్యూటర్‌లో ముందుగా రూపొందించిన ఇంటి డిజైన్‌కు సంబంధించిన డిజిటల్ బ్లూ ప్రింట్‌ను గాంట్రీ రోబోట్‌కు పంపిస్తారు. ఆ బ్లూ ప్రింట్‌ను అనుసరిస్తూ రోబోట్‌పైన అమర్చిన ప్రింటర్ హెడ్ నుంచి బ్లాకులు వేస్తూ గోడలు నిర్మిస్తుంది. ఆ విధంగా ఇంటి ఆకారం రూపుదిద్దుకుంటుంది. ఇంటి డిజైన్‌ను కచ్చితంగా అనుసరిస్తూ పటిష్ఠమైన పక్కా ఇళ్లను నిర్మించడానికి 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ విధానం బాగా ఉపయోగపడుతుందని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: