Share News

నేడు 3 లక్షల ఇళ్లకు శ్రీకారం

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:51 AM

పేదల సొంతింటి కలను నిజం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. వెయ్యికాదు.. లక్ష కాదు..

నేడు 3 లక్షల ఇళ్లకు శ్రీకారం

  • నేడు 3 లక్షల ఇళ్లకు శ్రీకారం

  • బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ

  • దేశంలో తొలి పైలట్‌ ప్రాజెక్టు.. తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణం

  • సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరు

  • 28 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు సాకారం.. మార్చికి మరో 4.2 లక్షలు

అమరావతి/గుంటూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కలను నిజం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. వెయ్యికాదు.. లక్ష కాదు.. ఏకంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో భూమిపూజ చేయనున్నారు. పేదల ఇళ్లను తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తి చేసేందుకు ‘త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌’ అనే అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ పైలట్‌ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం.. లబ్ధిదారులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు.

బుర్రిపాలెంలో 177 ఇళ్లు:

‘త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌’ టెక్నాలజీతో దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు కింద బుర్రిపాలెం, ఓబులనాయుడు పాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల వ్యయంతో 177 ఇళ్లను నిర్మించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 28 నెలల్లో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది. వచ్చే మార్చి నాటికి మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందజేసే దిశగా పనులు చేపడుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే.. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌(పీఎంఏవై-గ్రామీణ్‌) 2.0 పథకం కింద వీలైనన్ని ఇళ్లను మంజూరు చేసేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఇటీవలే కేంద్రం రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయించింది. కాగా, 3డీ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించే విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కృషి చేశారు.


గత పొరపాట్లకు తావు లేకుండా:

వైసీపీ హయాంలో కేంద్రం పీఎంఏవై(1.0) పథకం కింద రాష్ట్రానికి 18 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేసింది. ‘జగనన్న కాలనీ’ల పేరుతో ఊళ్లే నిర్మిస్తున్నామంటూ ఆ ఐదేళ్లూ ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం.. పేదల ఇళ్లను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇస్తుందంటూ కాంట్రాక్టర్లకు అప్పగించిన దాదాపు 3.5 లక్షలకు పైగా ఇళ్లు(ఆప్షన్‌-3) ఇప్పటికీ పూర్తి కాలేదు. రూ.వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన పొరపాట్లకు అవకాశం లేకుండా పూర్తిగా లబ్ధిదారుల ఇష్ట ప్రకారం, వారి ప్రమేయంతోనే నాణ్యమైన పక్కా ఇళ్లు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇళ్లు లేని అర్హులను గుర్తించేందుకు ‘ఆవాస్‌ ప్లస్‌’ పేరుతో ఇటీవలే సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దాదాపు 10 లక్షల కుటుంబాలను గుర్తించారు.

ఉత్తరాఖండ్‌ శాస్త్రవేత్తల కృషి..

రాష్ట్రంలో పీఎంఏవై-గ్రామీణ్‌, పీఎం జన్‌మన్‌ సహా వివిధ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని అక్టోబరులో గ్రౌండింగ్‌ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీబీఆర్‌ఐ-సీఎస్ఐఆర్‌) శాస్త్రవేత్తలు అధునాతన పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌’ విధానం గురించి తెలుసుకున్నారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి సీనియర్‌ అధికారులు ఇటీవల రూర్కీ వెళ్లి కేవలం 5 రోజుల్లోనే ఇల్లు నిర్మించే విధానాన్ని పరిశీలించి వచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 03:58 AM