గ్రామీణ వైద్యానికి ఊతం.. 264 విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కొత్త భవనాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:05 AM
గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలందిస్తున్న 264 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు రూ.103.61 కోట్లతో నిర్మించిన కొత్త భవనాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ 6న ప్రారంభించనున్నారు.
రూ.103.61 కోట్లతో నిర్మాణం పూర్తి
ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలందిస్తున్న 264 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు రూ.103.61 కోట్లతో నిర్మించిన కొత్త భవనాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ 6న ప్రారంభించనున్నారు. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ నందివాడ మండలం రుద్రపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జనార్దనపురం గ్రామం నుంచి రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. మంత్రి వర్చువల్ విధానంలో ఇతర జిల్లాల్లోని భవనాలను ప్రారంభించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వాటిని ప్రారంభించే విధంగా ఏర్పాటు చేశారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు, కొత్తగా చేపట్టిన నిర్మాణాలు కలిపి మొత్తం 4472 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు వివిధ పథకాల కింద రూ.1,128.02 కోట్లు కేటాయించారు. డిసెంబరు-2026 నాటికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరో 2750 భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 5 వేల జనాభాకు ఒకటి చొప్పున ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక సామాజిక ఆరోగ్య అధికారి లేదా మధ్యస్థాయి వైద్య సేవలందించే సిబ్బంది, ఒక సహాయక నర్సు, ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆశా కార్యకర్త చొప్పున ముగ్గురు నుంచి నలుగురు ఆశా కార్యకర్తలు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రాల్లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు, 71 రకాల వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. 2025-26లో ఈ కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు పరీక్షలు నిర్వహించారు.
ఈ వార్తలనూ చదవండి: