Uttam Kumar Slams Harish Rao: అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ఆరోపణలు చేయడం సరికాదు
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:22 PM
నదీ నీటి పంపకాలతోపాటు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఈ తరహా ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ ఆయనకు ఉత్తమ్ సూచించారు.
హనుమకొండ, అక్టోబర్ 11: అవాస్తవాలు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెలే, మాజీ మంత్రి టి. హరీశ్ రావుకు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదంటూ హరీశ్ రావుకు ఆయన హితవు పలికారు. శనివారం హనుమకొండలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్లపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అంతేకాదు.. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి పార్టీ వ్యతిరేకమని తాము మొదటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్రానికి ఇప్పటికే లిఖిత పూర్వక ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే ఆలమట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా కూడా తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కట్టకుండా చూస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అయితే నీటి పంపకాల పంచాయతీలో మంత్రి హోదాలో హాజరైన ఏకైక వ్యక్తిని తానేనని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
మీరు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయిందంటూ హరీశ్ రావుకు చురకలంటించారు. ఈ 22 నెలల్లో కాళేశ్వరం ప్రాజక్ట్ నయాపైసా కూడా పనికి రాలేదన్నారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో గోదావరి జలాలను ఆంధ్రకు అప్ప జెప్పారని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా నీటిని తాము కాపాడుకుంటామని తెలిపారు. తప్పడు మాటల ద్వారా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ హరీశ్ రావుపై మండిపడ్డారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ కట్టిన ఏకైక కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కూలిపోయిందని వ్యంగ్యంగా అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ తుమ్మడిహెట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్త లేదని విమర్శించారు. గోదావరి జలాల విషయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరీశ్ రావు మాట్లాడిన మాటలలో వాస్తవాలు ఏమి లేవని.. ఈ తరహా ప్రచారాన్ని మానుకోవాలంటూ ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.కోటి నజరానా..
రాహుల్‌కు నోబెల్ శాంతి బహుమతి..!: కాంగ్రెస్ నేత
Read Latest National News and Telugu News