Local Body Elections: మందు, మనీ.. తుది విడతలోనూ సాగిన ప్రలోభాల జాతర
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:53 AM
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.2వేల వరకు పంపిణీ
ఎంపిక చేసిన వారికి మద్యం బాటిళ్లు
కుల, గ్రామ పెద్దలకు ప్రత్యేక ప్యాకేజీలు
మహిళా సంఘాల బాధ్యులకు తాయిలాలు
హనుమకొండ/వరంగల్ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మూడో విడత పంచాయతీ పోలింగ్ బుధవారం జరగనుండటంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు, దామెర, శాయంపేట, నడికూడ మండలాల్లో జోరుగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు పంచారు. కొన్నిచోట్ల రూ.3వేలు కూడా ఇచ్చారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల అధ్యక్షులను, సభ్యులను మచ్చిక చేసుకునేందుకు వారికి తాయిలాలను ఎరచూపారు. గ్రామ, కుల పెద్దలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వారికి డబ్బులతో పాటు మద్యం పంపిణీ చేశారు. గ్రామాల్లోని యువ ఓటర్లను కూడా డబ్బు, వస్తు రూపేనా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ నాలుగు మండలాల్లో డబ్బులు, మందు, విందులు, కానుకలు అందించి వారిని మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడ్డారు. తండాలలో ఓటుకు రూ. మూడు వందలు, మేజర్ పంచాయతీలలో రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పంచారు. దాంతో పాటు అదనంగా కొన్ని చోట్ల మద్యం బాటిళ్లను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మటన్, చీరలు, మిక్సీలు సైతం పంపిణీ చేశారు. రాత్రికి రాత్రే కుల పెద్దలను, మహిళా సంఘాలను, పరుపతి సంఘాల సభ్యులను, రాజకీయ నాయకులను కలిసి తమకు మద్దతు తెలపాలని కోరారు. ఇందుకు సంబంధించి వారికి ప్రత్యేక ప్యాకేజీలను అందించారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్
జట్టుకు సీఈవోలా ఫీలవ్వకూడదు.. గంభీర్‌కు హర్ష భోగ్లే హెచ్చరిక