Share News

Kukatpally: కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:01 AM

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో ఇద్దరు మహిళలు మరణించారు. హైదరాబాద్‌లోని ఈఎ్‌సఐ ఆస్పత్రిలో నర్సమ్మ (54), నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సింగనమోని వెంకటమ్మ (65) మృతి చెందా రు.

Kukatpally: కల్తీ కల్లుకు మరో ఇద్దరు బలి

  • ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య

  • మరో 35 మందికి వివిధ ఆస్పత్రుల్లో వైద్యం

  • నలుగురి అరెస్టు.. రెండు దుకాణాల సీజ్‌

  • ఘటనపై ఆగస్టు 20లోగా నివేదిక ఇవ్వాలని హెచ్‌ఆర్సీ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ/హైదర్‌నగర్‌/ కూకట్‌పల్లి, నిమ్స్‌, ఖిల్లాఘణపురం జూలై 10 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో ఇద్దరు మహిళలు మరణించారు. హైదరాబాద్‌లోని ఈఎ్‌సఐ ఆస్పత్రిలో నర్సమ్మ (54), నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సింగనమోని వెంకటమ్మ (65) మృతి చెందా రు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. హైదరాబాద్‌, షంషీగూడలోని సాయిచరణ్‌ కాలనీకి చెందిన నర్సమ్మ (54) ఈఎ్‌సఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలానికి చెందిన సింగనమోని వెంకటమ్మ (65) హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో తన చిన్న కుమార్తె ఇంట్లో రెండు నెలలుగా ఉంది. ఆది, సోమవారాల్లో కేపీహెచ్‌బీ కాలనీలో కల్లుతాగి అస్వస్థతకు గురైన వెంకటమ్మ చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూలులో ఉన్న కుమారుడు దగ్గరకు వెళ్లింది. బుధవారం నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వెంకటమ్మ.. అదే రోజు రాత్రి మరణించింది. ఈ మేరకు నాగర్‌ కర్నూల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కల్తీ ఘటనలో మరో 35 మంది హైదరాబాద్‌లోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఘటన నేపథ్యంలో కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్‌లను తనిఖీలు చేసిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. హైదర్‌నగర్‌లోని హెచ్‌ఎంటీ హిల్స్‌, సర్దార్‌పటేల్‌ నగర్‌ దుకాణాల్లోని కల్లులో అల్ర్పాజోలం కలిపినట్టు కనుగొన్నారు. దీంతో నిర్వాహకులను అరెస్ట్‌ చేసి, దుకాణాల లైసెన్సులను రద్దు చేశారు. కాగా, కల్తీ కల్లు తాగి ఆస్వస్థతకు గురైన మరి కొందరు ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. హైదరాబాద్‌, ఆల్విన్‌కాలనీ డివిజన్‌ సాయిచరణ్‌కాలనీలో అన్నదమ్ములు నీలారెడ్డి, మన్నెంరెడ్డి, సత్తిరెడ్డి గురువారం గాంధీ ఆస్పత్రిలో చేరారు. నీలారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే హైదర్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ, సుగుణ మ్మను గురువారం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


సమగ్ర దర్యాప్తుకు హెచ్‌ఆర్సీ ఆదేశం

కల్తీకల్లు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆగస్టు 20 లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) రెవెన్యూ విభాగం (ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌) ప్రిన్సిపల్‌ సెక్రటరీకి గురువారం ఆదేశించింది. రామారావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుకు స్పందించి కేసు నమోదు చేసిన హెచ్‌ఆర్సీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. మరోపక్క, కల్తీ కల్లు తాగి ఆస్పత్రిపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సంబంధిత అధికారులను టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ఆదేశించారు. ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, ఘటనపై సమగ్ర నివేదికను అందించాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు.

రెండ్రోజుల్లో డిశ్చార్జిలు : రాజనర్సింహ

కల్తీ కల్లు వల్ల అస్వస్థతకు గురైన వారంతా కోలుకుంటున్నారని, మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి గురువారం పరామర్శించారు. అనంతరం మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లు కాంపౌండ్లపై దాడులు జరుగుతాయని తెలిపారు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల పరామర్శలు

36.jpg

కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్తీ కల్లు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కూకట్‌ పల్లి ఘటనలో ఎక్సైజ్‌ అధికారుల నిర్లక్ష్యం కనపడు తోందని ఆరోపించారు. ఇక, నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌.. కల్లులో ఏ రకమైన రసా యనాలు కలిపారనే విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇక, కల్తీ కల్లు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మౌనం వహించడం బాధ్యతారాహిత్యమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు. కాగా, కల్తీ కల్లు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు.


సారూ.. ఇటు చూడరూ..!

కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో కల్లు కాంపౌండ్ల నిర్వాహకుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు ప్రైవేటు దుకాణదారులు ప్రభుత్వ దుకాణమంటూ బోర్డు పెట్టి దందా నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి డివిజన్‌లోని తాండ్రపాపరాయుడు విగ్రహం సమీపంలోని దుకాణానికి నిర్వాహకులు ప్రభుత్వ కల్లు దుకాణం బోర్డు పెట్టారు. అలాగే, మూసాపేట, జనతానగర్‌లో మరో దుకాణాన్ని కూడా ఇలాగే నడిపిస్తున్నారు. ఇందులో ఎన్నింటికీ అనుమతులున్నాయో తెలుసుకునేందుకు ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌ఓని ఫోన్‌లో సంప్రదించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించిగా స్పందించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 06:01 AM