Share News

ఎఫ్‌ఆర్‌బీఎంను మించి.. 50 వేల కోట్ల అప్పు కావాలి!

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:13 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు ‘గ్యారెంటీ’లను పక్కాగా అమలు చేయాల్సి ఉండగా.. నెలవారీ వస్తున్న రాబడులేమో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రాయితీలకే సరిపోతున్నాయి!

ఎఫ్‌ఆర్‌బీఎంను మించి.. 50 వేల కోట్ల అప్పు కావాలి!

  • బడ్జెటేతర రుణాల కోసం సర్కారు యత్నాలు.. ప్రపంచ బ్యాంకు, జైకా, ఏడీబీతో సంప్రదింపులు

  • ఇందిరమ్మ ఇళ్లు, గురుకులాలు, ఆర్‌ఆర్‌ఆర్‌, మూసీ.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు!

  • ఇప్పటికే టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.2 వేల కోట్ల సేకరణ

  • భూములు తాకట్టు పెట్టి అప్పునకు యోచన.. గురుకులాల 25 ఎకరాలూ తనఖా పెట్టాల్సిందే!

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు ‘గ్యారెంటీ’లను పక్కాగా అమలు చేయాల్సి ఉండగా.. నెలవారీ వస్తున్న రాబడులేమో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రాయితీలకే సరిపోతున్నాయి! మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుమతించినదానికంటే ఒక్క పైసా రుణం ఎక్కువగా తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి! ఈ నేపథ్యంలో ‘ఆర్థిక బాధ్యత, ద్రవ్య నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం)’ పరిధిలోకి రాకుండా, బడ్జెట్‌కు ఆవల రుణాలు తీసుకోవాలన్నది సర్కారు సరికొత్త ఆలోచన!! రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భూములను తాకట్టు పెట్టి, బయటి ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు సేకరించే పనిలో పడింది. తక్కువ వడ్డీతో ఎక్కడ రుణం లభిస్తే అక్కడ తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఆయా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచ బ్యాంకు, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేటివ్‌ ఏజెన్సీ(జైకా), ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ), నాబార్డు, హడ్కో వంటి సహకార బ్యాంకులు, దేశీయ వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతోంది.


ఇప్పటికే ‘తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ)’ ద్వారా భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ద్వారా సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసి, ఈ రుణాన్ని సేకరించింది. మూడు నుంచి పదేళ్ల కాల వ్యవధితో ఈ బాండ్లను విడుదల చేసింది. ఈ రుణ సేకరణలో ఐసీఐసీఐ బ్యాంకు మధ్యవర్తి పాత్రను పోషించగా, ‘బీకాన్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌’ బాండ్‌ ఇన్వెస్టర్ల హక్కులకు ట్రస్టీగా నిలిచింది. ఈ అప్పు కోసం టీజీఐఐసీ, ఐసీఐసీఐ బ్యాంకు, బీకాన్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం ప్రభుత్వం మరో రూ.2000 కోట్ల అప్పును హడ్కో నుంచి సేకరించింది. రహదారి ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించే భూముల పరిహారంలో రాష్ట్రం తన వాటా కింద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు డిపాజిట్‌ చేయడానికిగాను రూ.2000 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకుంది. ఇలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా బడ్జెట్‌కు ఆవల రూ.12 వేల కోట్ల రుణాలను సేకరించింది.


టీజీఐఐసీ ద్వారా మరో రూ.20 వేల కోట్లు

టీజీఐఐసీ ద్వారా ఇప్పటికే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చిన ప్రభుత్వం.. అదే సంస్థ ద్వారా మరో రూ.20 వేల కోట్ల అప్పును తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ రుణం కోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబరు 25లోని 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయించింది. ఎకరాకు రూ.75 కోట్లుగా నిర్ధారించి భూబదలాయింపు జరిపింది. ఈ భూముల్ని వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు తనఖా పెట్టి మొత్తం రూ.30 వేల కోట్ల రుణాన్ని సేకరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే రూ.10 వేల కోట్లు సేకరించినందున మరో 20 వేల కోట్లను సేకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. టీజీఐఐసీ అధికారులు పలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు మరో 10 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 24లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ పథకం అమలుకు రూ.20 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇంత భారీగా నిధులను ప్రభుత్వ ఖజానా నుంచి సమకూర్చడం సాధ్యం కాదు. దీంతో హడ్కో నుంచి రుణం తీసుకోవాలని యోచిస్తోంది. మొత్తం రూ.20 వేల కోట్లను రుణంగా కాకుండా కొంత ఖజానా నుంచి సర్దుబాటు చేసి, దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా అప్పు సేకరించాలని ఆలోచిస్తోంది.


యంగ్‌ ఇండియా గురుకులాలకూ..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. వీటన్నింటికీ ఒకే చోట హాస్టల్‌, స్కూల్‌ భవనాలను సమకూర్చనుంది. యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాల పేరిట నియోజకవర్గానికొకటి చొప్పున మొత్తం 119 భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో గురుకులాన్ని 25 ఎకరాల్లో నిర్మించబోతోంది. వీటి నిర్మాణ బాధ్యతలను తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగించింది. ఇప్పటికే కొడంగల్‌, హుజూర్‌నగర్‌, మధిర గురుకులాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఒక్కో గురుకుల భవనానికి రూ.200 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొదటి దశ కింద 54 గురుకులాలను నిర్మించనున్నారు. వీటికి రూ.10,800 కోట్లు అవసరం. ప్రభుత్వం వద్ద ఇంత సొమ్ము లేదు. ఈ నేపథ్యంలో ఒక్కో గురుకులానికి కేటాయించిన 25 ఎకరాలను తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలని యోచిస్తోంది. కనీసం రూ.5000 కోట్ల రుణం సేకరించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఏడీబీ, జైకాలతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కోసం మరో రూ.5000 కోట్ల రుణం తీసుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో వైద్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు కూడా రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.14,100 కోట్లు అవసరమని పురపాలక శాఖ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి భూసేకరణ కోసం మరో రూ.3000 కోట్లను రుణంగా తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. ప్రపంచ బ్యాంకు అధికారులతో సమావేశమైన ప్రభుత్వ పెద్దలు.. మూసీ ప్రాజెక్టుతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌కు అవసరమైన రూ.3000 కోట్లను రుణంగా ఇవ్వాలని ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు రుణానికి తక్కువ వడ్డీ ఉండడంతో ఎక్కువ అప్పు తీసుకునే ఆలోచనలో ఉంది. ఇలా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.50 వేల కోట్ల వరకు రుణాలను సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కూడా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.20 వేల కోట్ల రుణాలు సేకరించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రుణాల ప్రతిపాదనలను సిద్ధం చేసి, వాటిని కార్యరూపంలో పెట్టేందుకు అవసరమైన సలహాదారు-బ్యాంకు మర్చెంట్‌ను నియమించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వ గ్యారెంటీలు ఉన్నా, లేకున్నా రుణాలు ఇప్పించాలని షరతు పెట్టింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత సర్కారు చేసిన అప్పుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోంది. పెనుభారంగా మారిన ఈ రుణాల పునర్వ్యవస్థీకరణకు యత్నిస్తోంది.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 04:13 AM