యాసంగి ధాన్యం టెండర్లు రద్దు
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:23 AM
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి (2022-23) ధాన్యం టెండర్లను రద్దు చేసింది. ఈ నెల 11 నాటికే గడువు పూర్తికావడం, అప్పటికే గుత్తేదారుల నుంచి పౌరసరఫరాల సంస్థకు చెల్లింపులు నిలిచిపోవడంతో టెండర్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 11కే పూర్తయిన తుది గడువు.. అప్పటికే చెల్లింపులు నిలిపివేసిన గుత్తేదారులు
గడువు పెంచొద్దని సర్కారు నిర్ణయం
25% ఫైన్ విధించాలనే ప్రతిపాదనలు
హైదరాబాద్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం యాసంగి (2022-23) ధాన్యం టెండర్లను రద్దు చేసింది. ఈ నెల 11 నాటికే గడువు పూర్తికావడం, అప్పటికే గుత్తేదారుల నుంచి పౌరసరఫరాల సంస్థకు చెల్లింపులు నిలిచిపోవడంతో టెండర్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండేళ్లుగా కొనసా..గుతున్న ధాన్యం టెండర్ల కథకు తెరపడినట్లయింది. అయితే 18 లక్షల టన్నుల ధాన్యం సొమ్ము రికవరీ కాగా, మిగిలిన 20 లక్షల టన్నులకు సంబంధించిన సొమ్మును ఎలా రాబట్టాలనే అంశంపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. టెండరు ధర క్వింటాకు రూ.2000పై 25 శాతం జరిమానా విధించి, మిల్లర్ల నుంచి వసూలు చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. 2022-23 యాసంగి సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో 38 లక్షల టన్నులు విక్రయించడానికి గత ప్రభుత్వం వేలం నిర్వహించింది. గుత్తేదారులు కూటమి కట్టడం, ధాన్యానికి తక్కువ ధర నిర్ణయించి బిడ్లు దాఖలు చేయడంతో 2023ఎన్నికలకు ముందు టెండర్లను రద్దు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి గ్లోబల్ టెండర్లు పిలిచింది. కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో టెండర్లు దక్కించుకున్న వారికే మళ్లీ టెండర్లు దక్కాయి. గతంలో మాదిరిగానే కూటమి కట్టి 12 లాట్లకూ సింగిల్ బిడ్లు దాఖలు చేశారు.
ప్రభుత్వం ఆ ఏజెన్సీలకే టెండర్లు ఖరారు చేసింది. 2024 జనవరి నుంచి 3 నెలల గడువిచ్చి.. 38 లక్షల టన్నుల ధాన్యానికి పౌరసరఫరాల సంస్థకు డబ్బులు చెల్లించి తీసుకెళ్లాలనే నిబంధన పెట్టారు. అయితే టెండరు ధర సగటున రూ.2వేలు కాగా.. రైస్‌మిల్లర్ల సంఘం నేతలు, గుత్తేదారులు కుమ్మక్కై క్వింటాకు రూ.230-250 చొప్పున అదనంగా ధర నిర్ణయించారు. ఈ లెక్కన మిల్లర్లపై ఒత్తిడి చేసి 18 లక్షల టన్నులకు డబ్బు వసూలు చేశారు. రూ.3,600 కోట్లు ప్రభుత్వానికి చెల్లించి, అదనంగా వసూలు చేసిన రూ.400 కోట్లకు పైగా సొమ్మును పంచుకున్నారు. అయితే, ఏడాదిన్నర గడువు ఇచ్చినప్పటికీ టెండరు ధాన్యం సొమ్ము రికవరీ కాలేదు. ఇంకా 20 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ఏజెన్సీలు ఎక్కువ సొమ్ము డిమాండ్ చేస్తున్నారనే కారణంతో మిల్లర్లు డబ్బులు చెల్లించలేదు. ఐదారు సార్లు గడువు పొడిగించినా 20 లక్షల టన్నులకు సంబంధించిన రూ.4 వేల కోట్లు రాలేదు.
క్యాబినెట్‌లో చర్చించిన తర్వాతే నిర్ణయం
మిల్లర్ల వద్ద మిగిలిపోయిన 20 లక్షల టన్నుల ధాన్యం సొమ్మును ఎలా రాబట్టాలనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం క్యాబినెట్ భేటీలో ఈ అంశం అజెండాలో లేదు. భవిష్యత్తులో నిర్వహించే సమావేశంలో చర్చించిన తర్వాతే మిగిలిన ధాన్యం సొమ్ము రికవరీపై నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ఉత్తమ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రైస్‌మిల్లు పరిశ్రమలో జరిగే చర్చకు, ప్రభుత్వానికి సంబంధం లేదని, పౌరసరఫరాల సంస్థకు నయాపైసా నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా టెండర్లు రద్దుకాగానే ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకొని, ధర తగ్గించి డబ్బులు చెల్లించాలనే మిల్లర్ల సంఘం నేతల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పౌరసరఫరాల కమిషనరేట్ నుంచి ఓ ఉన్నతాధికారి వద్దకు ఇటీవల టెండరు ధాన్యం ఫైలు వెళ్లినట్లు తెలిసింది. ‘‘ఏడాదిన్నర సమయం ఇచ్చాం. అయినా మిల్లర్లు ధాన్యం సొమ్ము చెల్లించలేదు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. 25ు జరిమానా విధిస్తూ ప్రతిపాదనలు తీసుకురండి. ప్రభుత్వ పెద్దలతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుందాం’’ అని ఆ అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అంటే టెండరు రేటు క్వింటా రూ.2 వేలపై 25 శాతం జరిమానా విధిస్తే.. మిల్లర్లు రూ.500 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి రూ.4 వేల కోట్లు కాదు.. 5 వేల కోట్ల ఆదాయం వస్తుంది.
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News