Banjara Hills: అమ్మవారికి కుంకుమార్చన ఉద్రిక్తం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:54 AM
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బీజేపీ, హిందూ సంఘాల నేతలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది.
బంజారాహిల్స్‌లోని ఆలయంలో బోనం సమర్పించేందుకు బీజేపీ నాయకుల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. పలువురు నేతల అరెస్టు
రాంచందర్‌రావు గృహ నిర్బంధం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గం ఓట్ల కోసమే
కాంగ్రెస్ సర్కారు అక్రమ అరెస్టులు: బండి సంజయ్
దేశభక్తి కార్యక్రమం చేపట్టడం నేరమా?: డీకే అరుణ
బంజారాహిల్స్/తార్నాక/హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బీజేపీ, హిందూ సంఘాల నేతలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును గృహనిర్బంధం చేయడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు నేతలు మండిపడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వం ఇటీవల స్వాధీనం చేసుకున్న 12 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయం ఉండేది. అయితే గత నెలలో కొందరు ఈ ఆలయాన్ని విస్తరించేందుకు స్లాబ్ నిర్మిస్తుండగా.. షేక్‌పేట రెవెన్యూ అధికారులు తొలగించారు. దీనిని నిరసిస్తూ ధార్మిక సంఘాలు, బీజేపీ నేతలు కొద్దిరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ స్థలంలో చిన్న షెడ్డు ఏర్పాటుచేసి.. అందులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ‘ఈ నెల 12న అమ్మవారికి బోనం సమర్పించడంతోపాటు, కుంకుమార్చన నిర్వహించాలి’ అంటూ సోషల్ మీడియా వేదికగా ధార్మిక సంస్థలు ప్రచారం చేశాయి. దీంతో పోలీసులు మంగళవారం అక్కడికి వెళ్లే అన్ని దారులను మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా.. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేచినేని శ్రీనివాసరావు సహా పలువురు నేతలు అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి అమ్మవారి చిత్రపటానికి కుంకుమార్చన నిర్వహించారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేసి ేస్టషన్‌కు తరలించారు.
రాంచందర్‌రావు గృహనిర్బంధం..
ధార్మిక సంస్థల పిలుపు నేపథ్యంలో పోలీసులు పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును తార్నాకలోని ఆయన నివాసంలో ఓయూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌ను గృహనిర్బంధం చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. కాగా, గృహనిర్బంధం విధించిన రాంచందర్‌రావు నివాసానికి పలువురు బీజేపీ నేతలు చేరుకుని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా యాత్రకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న తనను.. పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్నానంటూ హౌస్ అరెస్టు చేశారని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల అవివేకమైన చర్య అని మండిపడ్డారు. తనతోపాటు నగర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులను ముందస్తు అరెస్టు చేయడం చూస్తే పెద్దమ్మ గుడి ధ్వంసం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం ఉన్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. బుధవారం ఆలయాన్ని సందర్శంచి పూర్తి వివరాలు తెలుసుకుంటానన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంటి? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’ అని సంజయ్ ప్రశ్నించారు. ఆలయాన్ని కూల్చిన గూండాలను అరెస్టు చేయకుండా.. శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఒక ప్రకటనలో ఆరోపించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేయడం దారుణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. దేశభక్తి కార్యక్రమం (హర్ ఘర్ తిరంగా) చేయడం నేరమా?ఆలయ పూజలో పాల్గొనడం తప్పా? అని ప్రశ్నించారు. రాంచందర్‌రావును గృహ నిర్బంఽధం చేయడంపై ఆ పార్టీ నేతలు గంగిడి మోహన్‌రెడ్డి, ఎన్.వి.సుభాష్, కాసం వెంకటేశ్వర్లు తదితరులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర కోకన్వీనర్ సుభాష్ చందర్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News