Share News

ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:39 AM

ఫిబ్రవరి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అని, ఫిబ్రవరి 11న స్ర్కూటినీ జరుగుతుందని, 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని తెలిపింది.

ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు

  • ఖమ్మం, కరీంనగర్‌ టీచర్‌ స్థానాలకు..

  • కరీంనగర్‌ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు

  • ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌.. మార్చి 3న ఫలితాలు

  • షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

  • ఏపీలోనూ మూడు ఎమ్మెల్సీ సీట్లకు షెడ్యూల్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్‌ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, మెదక్‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, మెదక్‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - కరీంనగర్‌ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నట్లు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అని, ఫిబ్రవరి 11న స్ర్కూటినీ జరుగుతుందని, 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌), ఉ పాధ్యాయ ఎమ్మెల్సీలు కూర రఘోత్తం రెడ్డి (మెదక్‌ -నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌), అలుగుబెల్లి నర్సిరెడ్డి (వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ)ల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చి 8వ తేదీలోపే ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్టు ఈసీ పేర్కొంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.


2న కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు!

తెలంగాణ మొత్తం పది ఉమ్మడి జిల్లాలకుగాను ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికలను అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మూడింటిలో కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్‌ సిటింగ్‌ సీటు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సీటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జీవన్‌రెడ్డి.. ఈసారి పోటీలో నిలిచేందుకు ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు. దానికి బదులుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును ఆయన ఆశిస్తున్నారు. అయితే జీవన్‌రెడ్డినే మళ్లీ పోటీకి దింపాలని అధిష్ఠానం సూచిస్తోంది. తిరిగి పోటీ చేయడానికి జీవన్‌రెడ్డి సుముఖంగా లేకపోవడంతో ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జీవన్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా ప్రధానంగా అమిగోస్‌ విద్యాసంస్థల అధినేత ముస్కు రమణారెడ్డి, ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, పార్టీ నేతలు వెల్చాల రాజేందర్‌, ప్రసన్న హరికృష్ణ, మాజీ డీఎస్పీ గంగాధర్‌లు ప్రధానంగా రేసులో ఉన్నారు. ఎన్నికల్లో పోటీకి జీవన్‌రెడ్డి ససేమిరా అంటే.. ఈ ఐదుగురిలో ఒకరికి టికెట్‌ దక్కే చాన్స్‌ ఉందంటున్నారు.


మరోవైపున రెండు టీచర్‌ ఎమ్మెల్సీ సీట్లలో పార్టీ తరఫున అభ్యర్థిని నిలపాలా.. లేక మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలా? అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. అయితే ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్న టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి. హర్షవర్ధన్‌ రెడ్డి కొద్ది నెలలుగా నియోజకవర్గంలో ప్రచారమూ చేసుకుంటున్నారు. అలాగే టికెట్‌ కోసం తనవంతు ప్రయత్నం గట్టిగా చేసుకుంటున్నారు. కాగా.. కరీంనగర్‌ పట్టభద్రుల సీటు సహా మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి క్షేత్రస్థాయి సర్వేలనూ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తోంది. రెండు రోజుల్లో ఆ నివేదికలూ రానున్నాయి. అలాగే ఏడు ఉమ్మడి జిల్లాల నేతలతో టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ సంప్రదింపులూ జరుపుతున్నారు. మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఫిబ్రవరి 2న సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ భేటీ కానున్నారు. సర్వే నివేదికలు, పార్టీ నేతల అభిప్రాయాలు, అధిష్ఠానం సూచనలూ పరిగణనలోకి తీసుకుని ఆ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. మూడు ఎమ్మెల్సీ సీట్లకూ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ.. ప్రచారంలోనూ ముందుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సంబంధించి ఆ పార్టీలో ఇంకా స్పష్టత రాలేదు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..

నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 3

నామినేషన్ల దాఖలు గడువు ఫిబ్రవరి 10

పోలింగ్‌ ఫిబ్రవరి 27

ఓట్ల లెక్కింపు మార్చి 3


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 03:39 AM