Share News

TG Govt: అవుట్‌ సోర్సింగ్‌ భారం తగ్గించుకుందాం

ABN , Publish Date - May 02 , 2025 | 04:06 AM

రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తోంది. 1,27,326 మందిలో 19 వేల మందిని ఇప్పటివరకు తొలగించారు.

TG Govt: అవుట్‌ సోర్సింగ్‌ భారం  తగ్గించుకుందాం

  • అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కారు

  • ప్రస్తుతం 1,27,326 మంది.. సర్దుబాటు చేశాక 19 వేల మంది తొలగింపు

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాలు చేపడుతూనే.. ఆ స్థానంలో ఉండే తాత్కాలిక ఉద్యోగుల(అవుట్‌సోర్సింగ్‌)ను దశల వారీగా తొలగిస్తోంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలు చూపుతూనే.. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో అవసరానికి మించి ఉన్న అదనపు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటూ పోతోంది. పొరుగు సేవల ద్వారా వివిధ విభాగాల్లో పని చేస్తున్న అదనపు సిబ్బంది సుమారు 19 వేల మందిని విధుల నుంచి తప్పించింది. అవుట్‌ సోర్పింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆమేరకు శాఖల వారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్‌సోర్సింగ్‌ కింద ప్రభుత్వ విభాగాల్లో సుమారు 1,27,326 మంది పని చేస్తున్నారు. వీరితోపాటు ఒప్పంద ప్రాతిపదికన ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లతో కలిపి మరో 81,341 మంది ఉన్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు పేరుతో తొలగించవద్దని ఆయా సంఘాలనాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.. గ్రూప్‌-4 కింద నియామకమైన 8 వేల మందిని.. శాఖల వారీగా తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న వారి స్థానాల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన నియామకం అయిన ఒక జూనియర్‌ సహాయకునికి ఇచ్చే వేతనం ముగ్గురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనంతో సమానం అని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 58 వేల ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేసింది. 25 విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టింది. భర్తీ చేసిన ఉద్యోగాల వార్షిక వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమేరకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు చేస్తున్న అదనపు సిబ్బంది బడ్జెట్‌ కేటాయింపులను ఈ ఏడాది ప్రభుత్వం నిలిపివేసింది.


దీంతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి శాఖల వారీగా తొలగింపునకు చర్యలు చేపట్టింది. పాఠశాల విద్యాశాఖలో దశలవారీగా 60 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లతోపాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్టీసీ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్‌ వంటి చోట్ల తాత్కాలిక ప్రాతిపదికన అవసరానికి మించి ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నూతన ఆర్థిక సంవత్సరంలో కొనసాగించవద్దని ఆయా శాఖాధిపతులకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులందాయి. గత ఏడాది ఆర్థిక శాఖ నుంచి ఇచ్చిన ఉత్తర్వుల్లోనే తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగే ఉద్యోగులకు సంబంధించి.. రెగ్యులర్‌ ఉద్యోగులు వచ్చే వరకు లేదా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఆమేరకు చర్యలు చేపట్టింది. ఒక్క రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచే 155 మంది తాత్కాలిక ఉద్యోగులను తప్పించారు.

ప్రత్యామ్నాయ అవకాశాలు చూపాలి

ఈ ఏడాది తొలగించిన 19 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ఉద్యోగుల్లో చాలా మంది గత రెండు దశాబ్దాలుగా వివిధ శాఖల్లో పని చేస్తున్నారు. వారికి ఉన్న అనుభవం, అర్హత ఆధారంగా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను చూపాలి.

- ఏలూరి శ్రీనివాస్‌రావు, టీజీవో అధ్యక్షుడు, ఉద్యోగుల ఐకాస ప్రధాన కార్యదర్శి


For Telangana News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:11 AM