Kalvakuntla Kavitha: తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం: కవిత
ABN , Publish Date - Oct 18 , 2025 | 10:34 AM
బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్‌కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 18: తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీల బంద్‌కు మద్దతుగా ఆటోలతో ర్యాలీగా బయల్దేరి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి మాట్లాడారు. గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని.. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నట్లు తెలిపారు.
బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదని కవిత విమర్శించారు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదని చెప్పారు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని.. అందుకే కోర్టు జీవో ను కొట్టేసిందని అన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదని.. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోందని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధిగా పనిచేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
మానవహారంలో పాల్గొన్న యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ.. '78 ఏళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది. రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించకుండా బీజేపీ కూడా నాటకాలు ఆడుతోంది. బీఆర్ఎస్ కూడా కులగణన చేయకుండా మోసం చేసింది. జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం చేస్తోంది. ఏ పార్టీ కూడా బీసీలకు మంచి చేయటం లేదు. బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దొంగ మాటలు చెప్పే పార్టీలకు బీసీలంతా బుద్ది చెప్పే రోజు వస్తుంది. రిజర్వేషన్ల విషయంలో తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవద్దు. బీసీలు మీ చెప్పు చేతల్లో లేరు. మీ పాపాల లెక్కను మేము రాసుకుంటాం. బీసీలను మోసం చేస్తున్న అన్ని పార్టీలకు రాబోయే రోజుల్లో బుద్ది చెబుతాం. బీసీల పట్ల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
BC Reservations: బీసీ సంఘాల బంద్ ఎఫెక్ట్.. క్యాబ్‌ల్లో డబుల్ ఛార్జీలు
Katta Ramchandra Reddy: స్వగ్రామానికి కట్టా రామ్‌చంద్రారెడ్డి మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు