Share News

Hyderabad: 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ!?

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:43 AM

ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై మరొకటి; విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది.

Hyderabad: 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ!?
Telangana Assembly

  • ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులు

  • సభలో చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత

  • మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు

  • అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌

  • బీసీ రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కేంద్రానికి వినతి

  • కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం

  • అఖిలపక్ష నేతల్ని ఢిల్లీ తీసుకెళ్లే యోచన!

  • అన్ని పార్టీలకు త్వరలో సీఎం లేఖలు

  • మార్చి మూడవ వారంలో బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై మరొకటి; విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి, ఆమోదించిన అనంతరం చట్టబద్ధత కల్పించనుంది. ఈ నేపథ్యంలో మూడు బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అవి అందిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేయనుంది. రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయం తెలిసిందే. మాల, మాదిగల్లోని ఉపకులాలన్నింటినీ మూడు గ్రూపులుగా విభజించింది. గ్రూపు-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా అత్యంత వెనకబడిన, పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. గ్రూపు-2లో ఒక మోస్తరుగా లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9 శాతాన్ని ప్రతిపాదించింది. గ్రూపు-3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5 శాతాన్ని కేటాయించింది. మొత్తంగా కమిషన్‌ రాష్ట్రంలోని 59 కులాలకు 15 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. సర్కారు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసింది. నివేదికను బిల్లు రూపంలోకి తీసుకొచ్చి, వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. అలా చేస్తే రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, కమిషన్‌ గడువును తాజాగా పెంచడంతో వర్గీకరణలో ఏవైనా మార్పులు ఉంటాయా? అనే చర్చ కూడా జరుగుతోంది.


రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాటే!

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆ తర్వాత విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలనుకుంది. ఇప్పటివరకు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వాటికి అదనంగా మరో 13 శాతం పెంచాలని నిర్ణయించింది. బీసీలకు పెంచే రిజర్వేషన్‌ను ఏ, బీ, సీ, డీ, ఈ విభాగాల వారీగా పెంచాలని యోచిస్తోంది. అధికారులు కూడా ఆ మేరకే ముసాయిదాలు రూపొందించనున్నట్లు సమాచారం. అయితే బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చేసే చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదని న్యాయనిపుణులు చెబుతున్నారు. పెంచిన రిజర్వేషన్లు అమలు కావాలంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. లేదా పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. ఈ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేయాలని రేవంత్‌ సర్కారు భావిస్తోంది.


ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొనిపోవాలని యోచిస్తోంది. అన్ని పార్టీలకు త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి లేఖలు రాయనున్నట్లు తెలిసింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు రిజర్వేషన్‌ను పెంచే బిల్లుకు చట్టబద్ధత కల్పించి, దాన్ని కేంద్రానికి పంపనున్నారు. మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవనున్నాయి. అదే రోజు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి బీసీలకు రిజర్వేషన్‌ పెంపు అంశాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరనున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఢిల్లీకి రావాలని కోరనున్నట్లు తెలిసింది. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కూడా డిమాండ్‌ చేయనున్నారు. మార్చి మూడో వారంలో ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌పై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కీలక శాఖలతో బడ్జెట్‌ కేటాయింపులు, గతంలో కేటాయించిన నిధుల ఖర్చు సహా అన్ని అంశాలపై సమీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మార్చి 15 నుంచి 30 వరకు బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.


Also Read:

వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు

యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 08:38 AM