Share News

Land Disputes: నిషేధిత భూముల జాబితా పరిష్కారానికి త్రిసభ్య కమిటీ!

ABN , Publish Date - Aug 26 , 2025 | 02:06 AM

హైకోర్టు ఆదేశాల మేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టంలోని నిషేధిత భూముల జాబితా(సెక్షన్‌ 22ఏ)తో ముడిపడి ఉన్న వేల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది.

Land Disputes: నిషేధిత భూముల జాబితా పరిష్కారానికి త్రిసభ్య కమిటీ!

  • సీసీఎల్‌ఏ, రిటైర్డ్‌ జడ్జి, మరో అధికారి సభ్యులు

  • కమిటీ నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు

  • హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం

  • కలెక్టర్లు నిషేధిత జాబితా భూముల్ని గుర్తించాలి

  • వాటి వివరాలు సబ్‌ రిజిస్ట్రార్లకు పంపాలి: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టంలోని నిషేధిత భూముల జాబితా(సెక్షన్‌ 22ఏ)తో ముడిపడి ఉన్న వేల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ముగ్గురు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ రెండు రోజుల క్రితం జీవో 98 జారీ చేసినట్లు వెల్లడించింది. కమిటీలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి/సీసీఎల్‌ఏ ఛైర్మన్‌గా ఉంటారని, రిటైర్డ్‌ జిల్లా జడ్జి, సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి నిషేధిత జాబితాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తుందని చెప్పింది. వచ్చిన దరఖాస్తులను అంగీకరించడం లేదా తిరస్కరించడం ద్వారా నిషేధిత జాబితాలోని భూములను తొలగించడం, అలాగే ఉంచడం మీద నిర్ణయాలను తీసుకుంటుందని తెలిపింది. ఉన్నత స్థాయి కమిటీ తీసుకునే నిర్ణయాలకు అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు పార్టీలు లేదా ఫిర్యాదుదారులు కట్టుబడి ఉండాలని చెప్పింది. కమిటీ నిర్ణయం నచ్చకపోతే సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. సదరు కమిటీ మూడేళ్ల కాల పరిమితితో కొనసాగుతుందని, కనీసం నెలకు ఒక్కసారి అయినా కమిటీ భేటీ అయి దరఖాస్తులను పరిష్కరిస్తుందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.


నిషేధిత జాబితా భూముల వివరాలపై గతవారం ఆదేశాలు

నిషేధిత జాబితా భూములకు సంబంధించి తన కోర్టులో దాదాపు 5 వేల కేసులు పెండింగ్‌లో ఉండటంతో నిషేధిత జాబితా భూముల వివరాలను సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ ధర్మాసనం గతవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను గుర్తించి, ఆయా వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌లకు పంపాలని, ఈ ప్రక్రియ వల్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదని హైకోర్టు అభిప్రాయపడింది. జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాల పరిధిలో ఉన్న నిషేధిత జాబితా భూముల వివరాలు సేకరించి క్రోడీకరించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉండే సబ్‌ రిజిస్ట్రార్‌లకు ఈ జాబితాలు పంపితే ఏ భూములు రిజిస్ట్రేషన్‌ చేయకూడదో స్పష్టత ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినట్లు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీఎ్‌సకు ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల్లో దాఖలు చేయని పక్షంలో ప్రత్యక్షంగా తమ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరాలు అందించింది. వాదనలు విన్న ధర్మాసనం అన్ని జిల్లాల కలెక్టర్లు నిషేధిత జాబితా భూముల వివరాలను తొమ్మిది వారాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌లకు పంపాలని పేర్కొంది. కలెక్టర్లు ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు వివరాలు తెలియజేస్తూ పది రోజుల్లో సీఎస్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పేర్కొంది. అఫిడవిట్‌ వేయకపోతే సీఎస్‌ ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబరుమూడో తేదీకి వాయిదా వేసింది.


ఏ ప్రాతిపదికన తొలగించారు?

నాగారంలోని సర్వే 194, 195లో ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న దాదాపు 50 ఎకరాల భూములకు ఏ ప్రాతిపదికను పాస్‌ పుస్తకాలు ఇచ్చారో చెప్పాలని సీసీఎల్‌ఏ, రంగారెడ్డి కలెక్టర్‌, కందుకూరు ఆర్డీవో, మహేశ్వరం తహసీల్దార్‌ తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే 194, 195 నెంబర్లలోని నిషేధిత జాబితాలో ఉన్న దాదాపు 50 ఎకరాల ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయడంపై తాజాగా మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ భూముల రికార్డులు తారుమారు చేసి పలువురు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు రిజిస్ట్రేషన్‌ చేశారని, దీనిపై విచారణ చేపట్టాలని మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన బిర్ల మల్లేశ్‌ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. బిర్ల మల్లేశ్‌ తాజాగా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి అబ్దుల్‌ జావీద్‌, ఆర్షియా సుల్తానా, అబ్దుల్‌ లతీఫ్‌, మునావర్‌ఖాన్‌ పేరిట అప్పటి తహసీల్దార్‌ టి.సుబ్రమణ్యం పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేశారని, సదరు అధికారిపై చట్టపరంగా క్రమశిక్షణా చర్యలతోపాటు క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని మల్లేశ్‌ కోరారు. సర్వే నెంబర్‌ 194, 195లో దాదాపు 700 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఈ భూములు 2019 వరకు నిషేధిత జాబితాలో ఉన్నాయని, కానీ సదరు తహసీల్దార్‌ 2018 ఏప్రిల్‌లోనే ప్రైవేటు వ్యక్తులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేశారని.. గతంలో సదరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఎక్కడా రికార్డుల్లో లేవని పేర్కొన్నారు. ఈ ప్రైవేటు వ్యక్తులకు జారీ చేసిన పాస్‌ పుస్తకాల ఆధారంగానే వివాదం ఏర్పడిందని.. పలువురు ఐఏఎస్‌, ఐపీఎ్‌సల పేరిట రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు. అక్రమంగా నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములకు పాస్‌పుస్తకాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం నిషేధిత జాబితాలో ఉన్న సదరు భూములకు ఏ ప్రాతిపదికన పాస్‌ పుస్తకాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించింది. కలెక్టర్‌ నుంచి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.


అనుమతి లేని కేబుళ్లను తొలగించవచ్చు: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల అనుమతి తీసుకోకుండా వాటి స్తంభాలపై ఏర్పాటు చేసిన ఇంటర్నెట్‌ కేబుళ్లను తొలగించవచ్చని హైకోర్టు తెలిపింది. అనుమతి తీసుకున్న వాటిని మాత్రమే ప్రస్తుతానికి తొలగించరాదని చెప్పింది. ప్రభుత్వ విద్యుత్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని కేబుళ్లు వేసుకున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ చెబుతున్న నేపథ్యంలో ఆ సంస్థ అనుమతి పొందకుండా కేబుళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు ఎన్నో లెక్క తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఇంటర్నెట్‌ కేబుళ్ల కారణంగా విద్యుదాఘాతానికి గురై ఐదుగురు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్‌ స్తంభాలపై కేబుళ్లను తొలగించే కార్యక్రమం చేపట్టింది. దీనిపై భారతీ ఎయిర్‌టెల్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సోమవారం మరోసారి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో 20 లక్షల విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయని, ఎన్నింటికి కేబుళ్లు వేసుకోవడానికి అనుమతి పొందారో భారతీ ఎయిర్‌టెల్‌ చెప్పాలని ప్రభుత్వ న్యాయవాది ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని స్తంభాలపై ఎయిర్‌టెల్‌ కేబుళ్లు వేయడానికి తాము గుత్తగా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుళ్లను తొలగించవచ్చిన గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అలాగే, అనుమతి లేని విద్యుత్‌ స్తంభాలు ఎన్నో ప్రత్యేకంగా అధికారులను నియమించి లెక్క తేల్చాలని పేర్కొంది. పూర్తి స్థాయి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని విద్యుత్‌ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది.


Also Read:

గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..

కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 02:06 AM