Singur Reservoir: ప్రమాదంలో ‘సింగూరు’!
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:55 AM
రాజధాని హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగు నీటితోపాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సాగు నీటిని అందించే సింగూరు రిజర్వాయర్ ప్రమాదంలో పడింది.
ఎగువన ఉన్న రివిట్‌మెంట్ దెబ్బతిన్నది
రక్షణగా ఉన్న పిట్టగోడ నిలువునా చీలింది
ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
ఎక్కువ నీటి నిల్వ వల్లే ఈ పరిస్థితి సర్కారుకు ఆనకట్ట భద్రత కమిటీ నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగు నీటితోపాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సాగు నీటిని అందించే సింగూరు రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. తక్షణమే మరమ్మతులకు ఉపక్రమించకపోతే ఏ క్షణంలోనైనా ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని ఆనకట్ట భద్రత సమీక్ష కమిటీ(డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్) ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎగువ భాగంలో రాళ్లతో కూడిన రివిట్‌మెంట్ దెబ్బతిన్నదని, దీన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని సూచించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 29.91 టీఎంసీల సామర్థ్యంతో 1976లో సింగూరు రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించగా.. 1989లో పూర్తయింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 6.96 టీఎంసీలను కేటాయించడంతోపాటు ఘన్‌పూర్ ఆనికట్, నిజాం పరిధిలోని సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు మంజీరా నదిలో పూడికను కట్టడి చేయడానికి వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మించారు. డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్)లో ఉన్న ఈ ప్రాజెక్టును అశోక్‌కుమార్ గంజు చైర్మన్‌గా, నిర్మాణ రంగ నిపుణుడు, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ సభ్యుడు యోగిందర్‌కుమార్, మాజీ ఈఎన్‌సీ, హైడ్రాలజీ నిపుణుడు పి.రామరాజు, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డీజీ ఎం.రాజు, మెకానికల్ నిపుణుడు ఎన్.కన్నయ్య నాయుడు సభ్యులుగా ఉన్న ఆనకట్ట భద్రత సమీక్ష కమిటీజూన్ 23వ తేదీన పరిశీలించింది. ఈ మేరకు ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ, తక్షణమే చేపట్టాల్సిన మరమ్మతు పనులను తెలియజేస్తూ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
నివేదికలోని కీలక అంశాలివే..
సింగూరు రిజర్వాయర్ డిజైన్ ప్రకారం 517.8మీటర్ల దాకా నీటిని నిల్వ చేయాల్సి ఉండగా.. మిషన్ భగీరథ అవసరాల కోసం 520.50 మీటర్ల మేర నిల్వ చేసేందుకూ అనుమతి ఇస్తూ 2017 అక్టోబరు 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కొన్నేళ్లుగా రిజర్వాయర్‌లో 522 మీటర్ల కన్నా ఎక్కువగా నీటిని నిల్వ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. ఈ కారణం వల్లే జలాశయం తీవ్రంగా దెబ్బతిందని తేల్చింది. క్రమంగా కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మతులకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. దెబ్బతిన్న రివిట్‌మెంట్‌ను అత్యవసరంగా సరిచేయకపోతే ఏ క్షణంలోనైనా గండి పడే అవకాశం ఉందని తెలిపింది. అదేజరిగితే దిగువన ఉన్న మంజీరా బ్యారేజీ, నిజాంసాగర్‌తోపాటు చెక్‌డ్యామ్‌లు కూడా దెబ్బతింటాయని పేర్కొంది. ఆనకట్టకు రక్షణగా ఉన్న పిట్టగోడకు నిలువున చీలిక వచ్చిందని, ఒకవైపు గోడ వంగి ఉందని వివరించింది. కట్ట పునాదిని వెంటనే గ్రౌటింగ్ చేయాలని అభిప్రాయపడింది. 2016, 2019, 2024లో మొత్తం నాలుగు సార్లు సింగూరు జలాశయాన్ని తనిఖీ చేసి.. స్పిల్‌వే, ఎర్త్‌డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సిపారసులు చేసినా...పట్టించుకోలేదని గుర్తు చేసింది. స్పిల్‌వే పనులు కూడా సంపూర్ణంగా చేయలేదని, రిజర్వాయర్ దిగువ భాగంలో టెయిల్‌పాండ్ కూడా సరిగ్గా లేదని వెల్లడించింది. రేడియల్ గేట్లకు పెయింటింగ్ చేయాలని, రబ్బర్ సీళ్లను మార్చాలని సూచించింది. డ్యామ్‌లో 97శాతం నీటి నిల్వ గేట్ల మీద ఆధారపడి ఉందని గుర్తు చేసింది. గ్యాంట్రీ క్రేన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. తక్షణమే ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి, వానాకాలం అయిపోగానే మరమ్మతులు చేపట్టాలని సూచించింది. కట్ట మరమ్మతులకు అవసరమైన నిధులు డ్రిప్ నుంచి సమకూరకపోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు