Suryapet: నానమ్మ కళ్లలో ఆనందం చూడాలనే
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:19 AM
వేరే కులానికి చెందిన యువకుడు తన మునుమరాలిని తీసుకెళ్లి.. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ వృద్ధురాలు జీర్ణించుకోలేకపోయింది.

మనుమరాలని కులాంతర వివాహం చేసుకున్నాడని బంటిపై ఆమె కసి
వాణ్ణి చపండంటూ ఉసిగొల్పిన వైనం
హత్యకు స్కెచ్.. నాలుగోసారి సక్సెస్
కారులో తెచ్చి నాన్నమ్మకు శవాన్ని చూపిన మనవళ్లు
కులోన్మాదంతోనే హత్య.. ఆరుగురి అరెస్టు
సూర్యాపేటరూరల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వేరే కులానికి చెందిన యువకుడు తన మునుమరాలిని తీసుకెళ్లి.. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ వృద్ధురాలు జీర్ణించుకోలేకపోయింది. ఊర్లో తలెత్తుకోలేకపోతున్నామని.. వాణ్ని ఎలాగైనా చంపాలని అటు కుమారుడిని.. ఇద్దరు మనుమళ్లను రెచ్చగొట్టింది. అప్పటికే తమ సోదరిని పెళ్లి చేసుకున్న యువకుడిపై కోపంగా ఉన్న ఆ మనవళ్లు మరింత రెచ్చిపోయారు. తమ సోదిరిని పెళ్లిచేసుకున్న యువకుడిని పథకం ప్రకారం దారుణంగా హత్యచేశారు. ‘ఇదిగో.. చంపాం చూడు’ అంటూ కార్లో మృతదేహాన్ని ఇంటికి తెచ్చి మరీ ఆ వృద్ధురాలికి చూపించారు మృతదేహాన్ని చూశాక. శభాష్ రా మనవళ్లూ అంటూ ఆ వృద్ధురాలు వారిని మెచ్చుకుంది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో జరిగిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడి హత్యకేసును పోలీసులు ఛేదించారు. కులోన్మాదమే హత్యకు కారణమని తేల్చారు. హత్యకు ప్రధానంగా కులాంతర వివాహమే కారణమని.. అమ్మాయి ఇద్దరు సోదరులు, తండ్రి, స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ కేసు వివరాలను వెల్లడించారు.
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి సూర్యాపేటలో ఉంటూ బీ ఫార్మసీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. సూర్యాపేట మునిసిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్‌తో బంటికి పరిచయమైంది. బంటిని నవీన్ ఊర్లో పంచాయితీలు, సెటిల్‌మెంట్లలో తోడుగా ఉండేందుకు పిల్లలమర్రిలోని తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో నవీన్ సోదరి భార్గవితో బంటికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో భార్గవి ఇంట్లోవారు వీరి ప్రేమను అంగీకరించలేదు. నవీన్‌కు, బంటి మధ్య విభేదాలేర్పడ్డాయి. నిరుడు ఆగస్టు 7న ఎవ్వరికీ చెప్పకుండా భార్గవి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు నార్కెట్‌పల్లి మండలం గోపాలాయిపల్లి గుట్ట వద్ద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో బంటి-భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు. మూడు రోజుల తర్వాత సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో భార్గవి మిస్సింగ్ కేసు నమోదైంది. భార్గవిని బంటి స్టేషన్‌కు తీసుకెళ్లి.. తాము పెళ్లి చేసుకున్నామని, ఇద్దరమూ మేజర్లమని చెప్పాడు. భార్గవి కూడా బంటితోనే ఉంటానని, ఇద్దరం ప్రేమించుకున్నామని, ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని పోలీసుల ఎదుట చెప్పింది. దీంతో భార్గవి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించివేశారు. సూర్యాపేటలోని మామిళ్లగడ్డలోని తన అమ్మమ్మ పెరుమాళ్ల సాలమ్మ ఇంట్లో భార్గవితో కలిసి బంటి ఉంటున్నాడు. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి భార్గవి కుటుంబసభ్యులు రగిలిపోతున్నారు. ప్రత్యేకించి భార్గవి నాన్నమ్మ కోట్ల బుచ్చమ్మ (65) వాడిని (బంటిని) ఎలాగైనా చంపాలంటూ నవీన్‌ను రెచ్చగొట్టింది.
బంటి హత్య కోసం నవీన్ పథకం వేశాడు. ఇందుకు తనకు, బంటికి కామన్ ఫ్రెండ్ అయిన బైరు మహేశ్ సాయాన్ని తీసుకున్నాడు. బంటి హత్యకు పథకం వేసిన నవీన్ మూడుసార్లు యత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో 26వ తేదీ సాయంత్రం ఐదింటికి బంటికి మహేశ్ ఫోన్‌చేసి పిలిపించుకున్నాడు. బంటి స్కూటీపైనే ఇద్దరూ కలిసి మహేశ్ పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే నవీన్ తన సోదరుడు వంశీతో కలిసి అక్కడి పరిసరాల్లో మాటు వేశారు. తిరిగి వెళ్దామంటూ బంటి స్కూటీ స్టాట్ చేయగా వెంటనే మహేశ్, నవీన్, వంశీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బంటి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. నవీన్, మహేశ్, వంశీ కలిసి కారు డిక్కీలో మృతదేహాన్ని వేసుకున్నారు. నేరుగా.. ఆత్మకూర్(ఎస్) మండలం పాతసూర్యాపేట గ్రామానికి వెళ్లి.. బంధువుల ఇంట్లో ఉన్న నవీన్ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. మృతదేహాన్ని చూసిన బుచ్చమ్మ శభాష్ అంటూ మనుమళ్లను అభినందించింది. తర్వాత అదే కారులో నల్లగొండలో ఉన్న నవీన్ స్నేహితుడు చరణ్ ఇంటికి వెళ్లారు. చరణ్‌ను కారులో ఎక్కించుకొని బయలుదేరగా.. అతడు మధ్యలోనే దిగి వెళ్లిపోయాడు. చివరకు పిల్లలమర్రి శివారులో బంటి శవాన్ని పడేశారు. ఈ కేసుకు సంబంధించి భార్గవి సోదరులు నవీన్, వంశీ, తండ్రి సైదులు, నానమ్మ బుచ్చమ్మ, స్నేహితులు చరణ్, వంశీని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి