Saraswathi Pushkaralu: సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2025-05-15T18:47:04+05:30 IST

తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వీటిని సీఎం రేవంత్ రెడ్డి గురువారం కాళేశ్వరంలో ప్రారంభించారు.

Saraswathi Pushkaralu: సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy in Kaleshwaram

కాళేశ్వరం, మే 15: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణీ సంగమంలో సరస్వతి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు స్నానమాచరించారు. అనంతరం సరస్వతి నదికి హారతి ఇచ్చారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి.


బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇక ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకూ సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. భక్తుల కోసం తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు. అతి తక్కువ రుసుము చెల్లించిన వీటి సేవలను వినియోగించుకోవచ్చని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.


సరస్వతి పుష్కరాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.35కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లు చేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రతి రోజు సగటున లక్షన్నర మంది భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Hyderabad Metro Rail: ప్రయాణికులపై మెట్రో బాదుడు

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - 2025-05-15T20:34:27+05:30 IST