Hyderabad Metro Rail: ప్రయాణికులపై మెట్రో బాదుడు
ABN , Publish Date - May 15 , 2025 | 05:46 PM
Hyderabad Metro Rail: ప్రయాణికులపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఛార్జీల వడ్డింపునకు రంగం సిద్దమైంది.
హైదరాబాద్, మే 15: మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. ఇకపై మెట్రో రైలు టికెట్ ధర కనిష్టంగా రూ.12 కాగా.. గరిష్టంగా రూ.75గా పెరగనుంది. ప్రస్తుతం మెట్రో రైలులో టికెట్ కనిష్ట ధర రూ. 10.. గరిష్టంగా రూ.60గా ఉంది. ఈ పెంచిన ధరలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా ప్రయాణికులను ఈ మెట్రో రైలు గమ్యస్థానాలకు చేరుస్తుంది. అటు ఎల్ బీ నగర్ నుంచి ఇటు మియాపూర్ వరకు.. అలాగే ఇటు నాగోలు నుంచి అటు రాయదుర్గం వరకు ప్రయాణించే ఈ మెట్రో రైలు నగరవాసులను అతి కొద్ది కాలంలోనే ఆకట్టుకుంది. ప్రతి రోజు ఈ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నగరంలో భారీ వర్షం పడినప్పుడు.. ప్రయాణికులు ఈ మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే విశ్వ నగరం వేదికగా క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు.. మెట్రో ప్రత్యేక సర్వీసులను సైతం నడుపుతోంది.
అయితే మెట్రో నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో ఛార్జీల పెంపు ప్రతిపాదన గతంలోనే వచ్చింది. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో నాడు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మెట్రో రైలు సంస్థ వెనకడుగు వేసింది. కానీ మెట్రో రైలు సేవల కారణంగా.. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో ఛార్జీల పెంపు అనివార్యమైందని తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు భారీ నష్టాలతో నడుస్తుందని ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెట్రో ఛార్జీలు పెంపు అనివార్యమని స్పష్టం చేసింది. దీంతో మే 10వ తేదీ తర్వాత మెట్రో ఛార్జీలు పెంచుతామని ఇప్పటికే స్పష్టం చేసింది. అందులోభాగంగా మే 17వ తేదీ నుంచి ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది.
ఇంకోవైపు.. తెలంగాణ రాష్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తుంది. అందులో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు నష్టాల బాటలో నడిచేందుకు ఇది ఒక కారణమని ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News