Nalgonda: ప్రణయ్ హంతకుడికి మరణ శిక్ష
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:45 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో.. నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది.

నరికి చంపిన సుభా్‌షశర్మకు ఉరి ఖరారు
అమృత బాబాయి శ్రవణ్‌కుమార్ సహా ఆరుగురికి యావజ్జీవ కారాగారం
సంచలన తీర్పు వెలువరించిన నల్లగొండ అదనపు జిల్లా కోర్టు
శిక్ష తగ్గించాలని నిందితుల వేడుకోలు విచారణ దశలో అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య
కేసును సవాల్‌గా తీసుకున్న అప్పటి ఎస్పీ రంగనాథ్.. ఏడేళ్లు విచారణ
ఈ తీర్పు కులోన్మాదులకు చెంపపెట్టు
నిందితులూ సర్వం కోల్పోయారు
ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి
నల్లగొండ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో.. నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు(ఏ1) 2020లో ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభా్‌షశర్మకు మరణ శిక్ష, మిగతా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ.. జడ్జి రోజారమణి తీర్పునిచ్చారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడకు చెందిన తిరునగరు మారుతీరావు కుమార్తె అమృతవర్షిణి, పెరుమాళ్ల ప్రణయ్ తొమ్మిదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరుకావడంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని గ్రహించి.. వారిద్దరూ 2018 జనవరి 31న హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. తన కూతురు అమృత ఒక ఎస్సీ(మాల)ను వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మారుతీరావు(ఆర్యవైశ్య సామాజికవర్గం) ఆ పెళ్లిని పెటాకులు చేసేందుకు ప్రయత్నించారు. ఓ దశలో తన కుమార్తెను వదిలేస్తే.. రూ.1.50 కోట్లు ఇస్తానంటూ ప్రణయ్ తల్లిదండ్రులను మభ్యపెట్టారు. అయితే తమకు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్ నుంచి ముప్పు పొంచి ఉందంటూ ప్రణయ్-అమృత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలుమార్లు మారుతీరావుకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆయనలో మార్పు తీసుకొచ్చారు. అంతా ప్రశాంతంగా ఉందని భావిస్తున్న సమయంలో.. ప్రణయ్-అమృత పెళ్లి విందు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని జీర్ణించుకోలేని మారుతీరావు.. కులోన్మాదం, ప్రతీకారంతో రగిలిపోయారు. ప్రణయ్‌ని హత్య చేయించాలని నిర్ణయించుకుని, మిర్యాలగూడకు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీంకు రూ.కోటి సుపారీ ఇచ్చాడు. దాంతో కరీం.. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన అబ్దుల్‌బారీ, బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా జగత్‌సింగ్‌పూర్ గ్రామానికి చెందిన సుభా్‌షశర్మ, నల్లగొండ పట్టణానికి చెందిన అస్ఘర్‌అలీ(గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్య హత్యకేసు నిందితుడు)లతో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. గర్భిణిగా ఉన్న అమృతను ప్రణయ్ 2018 సెప్టెంబరు 14న మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తీసుకెళ్లిన సమయంలో.. సుభాష్ శర్మ అతణ్ని కత్తితో పొడిచి, చంపాడు. ఈ ఘటనను చూసిన అమృత, ప్రణయ్ తల్లి ప్రేమలత పెద్దపెట్టున కేకలు వేస్తూ.. మూర్చపోయారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అప్పట్లో ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుల వ్యతిరేక.. ప్రజా సంఘాల నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించి, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్న అప్పటి నల్లగొండ జిల్లా ఎస్పీ(ప్రస్తుతం హైడ్రా కమిషనర్) ఏవీ రంగనాథ్ నాలుగు రోజుల్లో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. తొమ్మిది నెలల్లోనే 1,600 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు.
ఒకరికి ఉరి.. ఆరుగురికి యావజ్జీవం
నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రణయ్ హత్యకేసు విచారణ ఏడేళ్ల పాటు కొనసాగింది. మొత్తం 78 మంది సాక్షులు కోర్టుకు వాంగ్మూలమిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ వాదనలను వినిపించారు. జడ్జి రోజారమణి సోమవారం 523 పేజీల తీర్పునిచ్చారు. ఏ-1గా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోగా.. ప్రణయ్‌ను హత్య చేసిన ఏ-2సుభా్‌షశర్మకు మరణశిక్ష, రూ.15 వేల జరిమానా విధించారు. ఏ-3 నుంచి ఏ-8 వరకు ఉన్న మిగతా నిందితులు-- మహమ్మద్ అస్ఘర్‌అలీ, మహ్మద్ అబ్దుల్‌బారీ, మహమ్మద్ అబ్దుల్ కరీం, తిరునగరు శ్రవణ్‌కుమార్(అమృత చిన్నాన్న), సముద్రాల శివ(మారుతీరావు డ్రైవర్), ఆటోడ్రైవర్ నిజాంలకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. తీర్పు అనంతరం సుభా్‌షశర్మను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అస్ఘర్‌అలీ ఇప్పటికే హరేన్‌పాండ్య హత్యకేసులో సబర్మతి జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. తీర్పు తర్వాత అతణ్ని సబర్మతి జైలుకు తరలించారు. మిగతా నిందితులను నల్లగొండ జిల్లా జైలుకు పంపారు. తీర్పు నేపథ్యంలో సోమవారం కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. దీంతో.. ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి.. మొత్తం 150 మంది బందోబస్తు నిర్వహించారు. మీడియా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అధికసంఖ్యలో రావడంతో.. కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ తీర్పుపై ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
కరుడుగట్టిన నేరస్థులే
ఈ కేసులో మరణ శిక్ష పడ్డ సుభా్‌షశర్మ, యావజ్జీవ శిక్ష పడిన అబ్దుల్‌బారీ, ఆస్ఘర్‌అలీకి కరడుగట్టిన నేర చరిత్ర ఉంది. బిహార్‌కు చెందిన సుభా్‌షశర్మ 13 ఏళ్ల వయసు నుంచే నేరాలకు పాల్పడుతున్నాడు. ఆయుధాల అక్రమ రవాణా కేసులో పుణె జైలులో శిక్ష అనుభవించాడు. ప్రణయ్ హత్యకు ఇతను రూ.2 లక్షల సుపారీకి తీసుకోవడం గమనార్హం..! అస్ఘర్‌అలీకి పాక్ నిఘా సంస్థ ఐఎ్‌సఐతో సంబంధాలున్నాయనే అభియోగాలున్నాయి. గుజరాత్ మాజీ హోమంత్రి హరేన్‌పాండ్యా హత్యకేసులో ఇతనికి యావజ్జీవ శిక్ష పడింది. అస్ఘర్‌తో కలిసి అబ్దుల్‌బారీ భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు చేసేవారు. అబ్దుల్‌బారీ ఓ సందర్భంలో మారుతీరావును కూడా బెదిరించి, డబ్బులు వసూలు చేశాడు. అబ్దుల్ కరీం(అప్పట్లో కాంగ్రెస్ నేత)తో మారుతీరావుకు మైత్రి ఉంది. దాంతో.. కరీం ద్వారా ఈ గ్యాంగ్‌ను మారుతీరావు సంప్రదించాడు. సుభా్‌షశర్మ ఓ దోపిడీ కేసులో రాజమహేంద్రవరం జైలుకు వెళ్లగా.. అక్కడే అస్ఘర్‌అలీతో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు, మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కుమార్.. మొదటి నుంచి అమృత ప్రేమను అంగీకరించలేదు. ఓ సందర్భంలో తనను బాబాయి డంబెల్స్‌తో కొట్టాడని అమృత చెప్పారు. శ్రవణ్‌కుమార్ ఆస్తికోసం వేధించడంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అప్పట్లో ఆమె ఆరోపించారు. మారుతీరావు డ్రైవర్ శివ, నిందితులను ఆటోలో తిప్పిన నిజాంకు కూడా ఈ కేసులో శిక్ష పడింది.
శిక్ష తగ్గించాలని వేడుకున్న నిందితులు
జస్టిస్ రోజారమణి తీర్పును వెలువరించడానికి ముందు నిందితులతో.. ‘‘చెప్పుకోవడానికి ఏమైనా ఉందా?’’ అని ప్రశ్నించారు. ఆ వెంటనే.. నిందితులు ఒక్కొక్కరుగా తమకు శిక్షను తగ్గించాలని వేడుకున్నారు. ‘‘నా కుటుంబానికి నేనే ఆధారం. నా తండ్రి ఇటీవలే చనిపోయారు. కర్మకాండలను నిర్వహించాల్సి ఉంది. నా తల్లిని పోషించాల్సిన బాధ్యత నాపైనే ఉంది’’ అని సుభాష్ శర్మ జడ్జిని వేడుకున్నాడు. అస్ఘర్‌అలీ, అబ్దుల్‌బారీ, అబ్దుల్‌కరీం కూడా చిన్న పిల్లలున్నారని, గుండె, ఇతర అనారోగ్య సమస్యలున్నాయని, పిల్లల బాధ్యత తమపైనే ఉన్నందున శిక్షను తగ్గించాలని జడ్జిని కోరారు. శ్రవణ్‌కుమార్ తనకు పెళ్లికావాల్సిన ఇద్దరు కుమార్తెలున్నారని, నిరుద్యోగి అయిన కుమారుడు ఉన్నాడని, ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదనే విషయం అందరికీ తెలుసునని చెప్పారు. డ్రైవర్ శివ తన భార్య విడాకులిచ్చిందని, ఇద్దరు చిన్నపిల్లల బాధ్యత తనపైనే ఉందని.. ఆటోడ్రైవర్ నిజాం కూడా తనను భార్య విడిచివెళ్లిందని, చిన్న పిల్లలు అనాథలవుతారని, తనకు గుండె సమస్యలున్నాయని, క్షమించి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేసును సవాల్‌గా తీసుకున్న రంగనాథ్
అప్పటి నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ ప్రణయ్ హత్యకేసును సవాల్‌గా తీసుకున్నారు. అప్పటి డీఎస్పీ(ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అదనపు ఎస్పీ) శ్రీనివాస్, ఇతర దర్యాప్తు అధికారులతో రేయింబవళ్లు కేసు పురోగతిపై సమీక్షలు నిర్వహించేవారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా.. తొమ్మిది నెలల్లో 1,600 పేజీల చార్జిషీట్‌ను సిద్ధం చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, నిందితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాల విషయంలో శ్రద్ధ వహించారు. పకడ్బందీగా సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయించారు. అప్పటి డీఎస్పీ శ్రీనివాస్ కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. కోర్టు తాజా తీర్పుపై రంగనాథ్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
రైలులో బిహార్ వెళ్లేలోపే.. విమానంలో చేరుకుని..!
ప్రణయ్ హత్య తర్వాత సుభా్‌షశర్మ రైలులో బిహార్‌కు పారిపోయాడు. అతణ్ని నల్లగొండ నుంచి పంపించేస్తే.. ఎలాంటి ఆధారాలు దొరకవని నిందితులంతా భావించారు. అయితే.. ఎస్పీ రంగనాథ్ మారుతీరావును విచారించడంతో డొంకంతా కదిలింది. సుభా్‌షశర్మ బిహార్‌కు చెక్కేసినట్లు తేలడంతో.. చార్టెడ్ విమానంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోని ఓ బృందాన్ని బిహార్‌లోని జగత్‌సింగ్‌పూర్‌కు పంపారు. నిజానికి ఆ ఊరు ‘ఖాకీ’ సినిమా మాదిరిగా ఉంటుంది. కొత్తవారు కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపడానికీ వెనకాడరు. అలాంటి ఊరికి వెళ్లిన నల్లగొండ బృందం అక్కడి పోలీసులతో కలిసి.. సుభా్‌షశర్మను అదుపులోకి తీసుకుంది.
2020లో మారుతీరావు ఆత్మహత్య
మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. తనకు మరణశిక్ష తప్పదని అర్థం చేసుకున్న మారుతీరావు.. తన భార్య గిరిజతో చివరిసారి ఫోన్‌లో మాట్లాడి.. గారెల్లో విషం కలుపుకొని తిని, బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘‘గిరిజా.. నన్ను క్షమించు’’ అంటూ భార్యకు.. ‘‘అమృత.. అమ్మ వద్దకు వెళ్లమ్మా..’’ అంటూ తన కూతురికి రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు.
కన్నీటి పర్యంతమైన శ్రవణ్ భార్య, కుమార్తె
కేసులో యావజ్జీవ శిక్షపడిన తిరునగరు శ్రవణ్‌కుమార్(అమృత చిన్నాన్న) భార్య పద్మజ, కుమార్తె స్ఫూర్తి.. తీర్పు వెలువడగానే కోర్టు ప్రాంగణంలో తీవ్రంగా రోదించారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని, ఏ పాపం తెలియని శ్రవణ్‌కుమార్‌ను పోలీసులు కేసులో ఇరికించారని, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో స్ఫూర్తికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో.. మహిళా ఎస్సై, కానిస్టేబుళ్లు వారిని కోర్టు బయటకు పంపారు.
కోర్టుకు రాని అమృత, ప్రణయ్ కుటుంబీకులు
తీర్పు సందర్భంగా అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు కోర్టుకు రాలేదు. అమృత రెండ్రోజుల క్రితమే తన ఫోన్‌ను స్విచాఫ్ చేసుకున్నారు. తీర్పు వెలువడ్డాక ప్రణయ్ తండ్రి బాలస్వామి, తన కుమారుడి సమాధి వద్దకు వెళ్లి, నివాళులర్పించారు. అక్కడ, తన ఇంటి వద్ద కంటతడితో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రణయ్ హత్యతో నేను కుమారుడిని, అమృత తన భర్తను, నా మనవడు తండ్రిని కోల్పోయారు. ఈ హత్య తర్వాత చాలా కులోన్మాద హత్యలు జరిగాయి. హత్యలు చేసేవారికి ఈ తీర్పు కనువిప్పు కావాలి’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ప్రణయ్ హత్య తర్వాత అమృత తన అత్తింట్లోనే ఉన్నారు. అక్కడే ఓ బాబుకు జన్మనిచ్చారు. మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తన తల్లి గిరిజను దరిచేర్చుకున్నారు. అత్తింటితో సంబంధాలు కొనసాగిస్తూనే.. తల్లి, తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ‘అమృత ప్రణయ్’ పేరుతో 5 లక్షల సబ్‌స్ర్కైబర్లున్న ఓ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తున్నారు.
తీర్పుల ఆలస్యం వల్లే కులోన్మాద హత్యలు మాల కృష్ణ భార్య భార్గవి
సూర్యాపేటక్రైం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రణయ్ హత్య కేసు విచారణ సుమారు ఆరేళ్లకుపైగా సాగిందని, ఈ హత్య కేసును త్వరగా విచారించి శిక్షలు విధించి ఉంటే.. తన భర్త మాల కృష్ణ అలియాస్ బంటితో పాటు సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని మాల కృష్ణ భార్య భార్గవి అన్నారు. సోమవారం భార్గవి సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రణయ్ హత్యోదంతంలో నిందితులకు శిక్ష పడిన మాదిరే తన భర్తను హత్య చేసిన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేసి తమకూ న్యాయం చేయాలని ఆమె కోరారు. కులోన్మాద హత్యల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారణ చేయించి త్వరగా శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.కాగా, నానమ్మ కళ్లలో సంతోషం కోసం తన చెల్లెలు భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మాల కృష్ణను భార్గవి అన్న నవీన్ మరో ఇద్దరితో కలిసి ఈ ఏడాది జనవరి 26న హత్య చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News