Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్ ట్యాపింగ్
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:50 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్ చేసినట్టు సమాచారం.
జాబితాలో తెలంగాణతోపాటు ఏపీ నేతల ఫోన్లు కూడా!
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా
ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్‌కు..
తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్‌రావు లీలలు
నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్
ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది
నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, గాలి అనిల్‌కుమార్,
గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌తోపాటు
సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే: మహేశ్‌గౌడ్
నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు!
హైదరాబాద్/వికారాబాద్/పటాన్‌చెరు/షాద్‌నగర్ అర్బన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్ చేసినట్టు సమాచారం. తన ఫోన్‌ను తెలంగాణ ఎస్‌ఐబీ అధికారులు ట్యాప్ చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలోనే ఆరోపించారు. షర్మిల ఫోన్‌తోపాటు ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటే వారందరి ఫోన్లను కూడా ఎస్‌ఐబీ అబ్జర్వేషన్‌లో పెట్టిందని సిట్ విచారణలో వెల్లడైనట్టు సమాచారం. షర్మిలకు సంబంధించి ఒక కోడ్‌నేమ్ వాడారని.. ఆమె కదలికలు, సంభాషణలను రికార్డు చేసి, నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు పంపించారని తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసే ద్వితీయ శ్రేణి నేతలు మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు ఫోన్లను ట్యాప్ చేశారని.. నెలల తరబడి అబ్జర్వేషన్‌లో పెట్టారని సిట్ గుర్తించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలతోపాటు సొంత పార్టీల నేతలు, పలువురు జడ్జీలు, ఇతరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫోన్లు ట్యాప్ అయిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, ఇతరుల వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, గద్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు సరిత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు.
ఎవరి ఆదేశాలతో ఆధారాల ధ్వంసం?
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రత్యేక వార్ రూములు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని స్పష్టమైన వెంటనే ప్రభాకర్‌రావు తన శిష్యుడు ప్రణీత్‌రావు ద్వారా ధ్వంసం చేయించినట్టు ఇప్పటికే వెల్లడైంది. అయితే డేటా ధ్వంసానికి ముందు ఏం జరిగింది? ప్రభాకర్‌రావు, ఆయన బృందం ఎవరెవరితో ఫోన్‌లు మాట్లాడారన్న అంశాలను తేల్చేందుకు సిట్ అధికారులు వారి కాల్‌డేటా, టవర్ లోకేషన్ల విశ్లేషణ ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు మూడు విడతలు సిట్ విచారణకు హజరైన ప్రభాకర్‌రావు.. నాటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనిచేశానని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, నాటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా నుంచి సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా మావోయిస్టులపై నిఘా పేరిట జరిగిన రాజకీయ ఆపరేషన్ కావడంతో... ప్రభాకర్‌రావుకు ఏ నాయకులు ఈ ఆదేశాలు ఇచ్చారన్నది తేల్చడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల ప్రోద్బలంతోనే ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభాకర్‌రావు ఇప్పటివరకు విచారణలో కేసీఆర్ పేరుగానీ, మరెవరి పేర్లుగానీ బయటపెట్టలేదని సమాచారం.
నేడు నాలుగోసారి ప్రభాకర్‌రావు విచారణ
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బుఽధవారం నాలుగోసారి సిట్ ముందు విచారణకు హజరవుతున్నారు. ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నను మరోసారి విచారించేందుకు.. అవసరమైతే వీరందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించేందుకు సిట్ సన్నాహలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రభాకర్‌రావు ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అంశాన్ని బుధవారం నిర్ధారించుకోవాలని అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు ఆదేశాలతో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ప్రణీత్ బృందం ట్యాప్ చేసి, ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసిందని, ఆయన ఈ సమాచారాన్ని బీఆర్‌ఎస్ నాయకత్వానికి అందించేవారని సిట్ విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఇక కొందరు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలనూ తేల్చడంపై సిట్ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ మేరకు నిందితుల బ్యాంకు లావాదేవీలు, వారి సన్నిహితులు, బినామీల లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
నేడు సిట్ ముందుకు బీజేపీ నేతలు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం నమోదు కోసం బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావులను బుధవారం విచారణకు రావాలని సిట్ పిలిచినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ప్రభాకర్‌రావు బృందం ట్యాప్ చేసిందని.. ఆర్ధిక సాయం అందకుండా అడ్డుకోవడంతోపాటు వ్యూహాలను తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టిందని బీజేపీ నేతలు గతంలోనే ఆరోపించారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి డ్రైవర్ జగదీశ్వర్‌ను వాంగ్మూలం నమోదు కోసం పిలిచినట్టు సమాచారం.
రాజకీయ కుట్రతోనే ట్యాపింగ్: మహేశ్‌గౌడ్
రాజకీయ కుట్రలో భాగంగానే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 650 మంది నేతలతోపాటు బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లనూ అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు తలొగ్గి అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ, హోం సెక్రటరీ ఫోన్ ట్యాపింగ్ జరిపించారని ఆరోపించారు. హోదా లేని ప్రభాకర్‌రావును ఐజీ హోదాలో ఎస్‌ఐబీలో కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించారని పేర్కొన్నారు. తమను నక్సలైట్ల సానుభూతిపరులుగా చూపిస్తూ ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. కాగా, సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేసిందని, తనతోపాటు, అనుచరులు, డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలవకుండా అప్పటి అధికార బీఆర్‌ఎస్ నాయకులు కుట్రతో ఫోన్ ట్యాపింగ్ చేయించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్
Read Latest Telangana News And Telugu News