Share News

Nurse Negligence: వీడియో కాల్‌ ద్వారా నర్సు వైద్యం...

ABN , Publish Date - May 06 , 2025 | 05:40 AM

పిల్లల కోసం ఆరేళ్ల నిరీక్షణ.. ఎన్నెన్నో ఆశలు.. చివరికి ఆమె గర్భవతైంది. కానీ, ఐదు మాసాలకే ఆశలు అడియాసలయ్యాయి. వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా నెలలు నిండని ఓ గర్భిణికి నర్సు చేసిన వైద్యం వికటించి కవల పిల్లలు మృతి చెందారు.

Nurse Negligence: వీడియో కాల్‌ ద్వారా నర్సు వైద్యం...

  • నెలలు నిండని ఓ గర్భిణికి చికిత్స

  • గర్భంలోనే కవల పిల్లల మృతి, తల్లి క్షేమం

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన

  • ఆస్పత్రిని సీజ్‌ చేసిన జిల్లా వైద్యాధికారి

ఇబ్రహీంపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): పిల్లల కోసం ఆరేళ్ల నిరీక్షణ.. ఎన్నెన్నో ఆశలు.. చివరికి ఆమె గర్భవతైంది. కానీ, ఐదు మాసాలకే ఆశలు అడియాసలయ్యాయి. వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా నెలలు నిండని ఓ గర్భిణికి నర్సు చేసిన వైద్యం వికటించి కవల పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులో ఉన్న విజయలక్ష్మి ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి కీర్తి, గణేష్‌ దంపతులకు పెళ్లయి ఆరేళ్లయినా పిల్లలు కలుగలేదు. దీంతో వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్‌ పద్ధతిలో కీర్తి గర్భం దాల్చింది. కాగా, ఐదు నెలల గర్భంతో ఉన్న ఆమెకు ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు విజయలక్ష్మి ఆస్పత్రికి తీసుకొచ్చారు.


34.jpg

ఆ సమయంలో వైద్యురాలు డా.అనూషారెడ్డి అందుబాటులో లేకపోవడంతో విషయాన్ని నర్సు ఆమెకు తెలియజేసింది. దీంతో వీడియో కాల్‌ ద్వారా డా.అనూషారెడ్డి సూచనలతో నర్సు చికిత్స చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో కీర్తికి తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు వైద్యం వికటించి గర్భంలో కవలలు మృతి చెందారు. వెంటనే వైద్యురాలు డా.అనూషారెడ్డి ఆస్పత్రికి చేరుకుని కీర్తికి అత్యవసర చికిత్స చేసి పర్యవేక్షణలో ఉంచారు. కాగా, ఆస్పత్రి బిల్లు రూ.30 వేలు అయ్యిందని, దానిని కట్టాల్సిందిగా కీర్తి కుటుంబ సభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం సూచించింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కీర్తి గర్భంలో కవల పిల్లలు మృతి చెందారని ఆరోపిస్తూ సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) డా. వెంకటేశ్వరరావు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైద్యురాలు లేకుండా నెలలు నిండని గర్భిణికి నర్సు వైద్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన వైద్యాధికారి వెంటనే ఇన్‌ పేషెంట్లను పంపించి వేసి ఆస్పత్రికి సీజ్‌ చేశారు. తదుపరి విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:40 AM