Share News

Hyderabad Metro Rail: కొత్త రైళ్లు ఇప్పట్లో లేనట్లే...

ABN , Publish Date - Oct 22 , 2025 | 09:29 AM

నగరంలోని మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లు, కొత్త రైళ్లను ఇప్పట్లో తీసుకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎల్‌అండ్‌టీ నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటున్న తరుణంలో అదనపు కోచ్‌ల ఏర్పాటు మరికొన్ని రోజుల పాటు ఆలస్యమయ్యేట్లు కనిపిస్తోంది.

Hyderabad Metro Rail: కొత్త రైళ్లు ఇప్పట్లో లేనట్లే...

- ‘మెట్రో’ బాధ్యతలు తీసుకునేందుకు వేగంగా చర్యలు

- తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకుల వైపు ప్రభుత్వం చూపు

- కొత్త బోగీలు మరింత ఆలస్యం

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని మెట్రో రైళ్లకు(Metro trains) అదనపు కోచ్‌లు, కొత్త రైళ్లను ఇప్పట్లో తీసుకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎల్‌అండ్‌టీ నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటున్న తరుణంలో అదనపు కోచ్‌ల ఏర్పాటు మరికొన్ని రోజుల పాటు ఆలస్యమయ్యేట్లు కనిపిస్తోంది. ముందుగా బ్యాంకులకు చెల్లించాల్సిన ఎల్‌అండ్‌టీ అప్పులు రూ.13 వేల కోట్లు, వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద సంస్థకు ఇవ్వాల్సిన రూ.2వేల కోట్లను ఇచ్చేందుకు ముందుకు సాగుతోంది. తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులను వెతుకుతూ సదరు మొత్తాన్ని చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మొదటిదశ మెట్రోకు అదనంగా తీసుకురావాలని భావించిన కొత్త రైళ్లు, కోచ్‌లు ఇప్పట్లో సాధ్యపడని పరిస్థితి నెలకొంది.


రెండేళ్ల క్రితం ప్రకటన

మెట్రోలో ఇటీవల కాలంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగీలను తీసుకొస్తామని రెండేళ్ల క్రితం ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రకటించారు. గతేడాది నవంబరు 28న జరిగిన మెట్రో ఏడో వార్షికోత్సవ సమావేశంలో ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి కొత్త కోచ్‌లపై స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. నాగ్‌పూర్‌, పుణే(Nagpur, Pune) నుంచి అదనపు బోగీలను తీసుకొచ్చేందుకు రెండేళ్లుగా ప్రయత్నించామని,


కుదరకపోవడంతో బెంగళూరు(Bengaluru)లోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈ ఎంఎల్‌)తో సంప్రదింపులు చేస్తున్నామని, ఏడాదిలోపు 4 నుంచి 7 కొత్త రైళ్లను (మూడు కోచ్‌లతో) కచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. కొత్త రైళ్ల కొనుగోలు సాధ్యపడకపోతే కనీసం 40-70 వరకు కోచ్‌లనైనా తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అధికారులు చేసిన ప్రకటన నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.


city5.2.jpg

ఎల్‌అండ్‌టీ నుంచి తీసుకున్న తర్వాతే!

మొదటిదశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిగా తీసుకున్న తర్వాతనే కొత్తరైళ్లు, అదనపు బోగీల విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోనున్నట్లు తెలుస్తోంది. రెండోదశ విస్తరణ పనులు మొదలు కావాలంటే ముందుగా ఎల్‌అండ్‌టీకి ఇస్తానన్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కొత్త మెట్రో కోచ్‌ను కొనుగోలు చేయాలంటే సుమారు రూ.8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చవుతోందని, కనీసం 40 కోచ్‌లు తీసుకుంటే రూ.320 కోట్లకు పైగా ఖర్చవుతోందని, అంత ఖర్చును ఇప్పట్లో పెట్టే పరిస్థితి కనిపించడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2025 | 09:29 AM