Batukamma Festival In Telangana: తెలంగాణకు ప్రత్యేక స్థానం తెచ్చిన పండగ బతుకమ్మ: ఎమ్మెల్యే హరీశ్ రావు
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:55 PM
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండపాక మండలం మర్పడ్గ శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జునస్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. అనంతరం బతుకమ్మ పండగ విశేషాలను ఆయన వివరించారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 29: ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన పండగ.. బతుకమ్మ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కొండపాక మండలం మర్పడ్గ శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జునస్వామివారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతోపాటు ప్రత్యేక రాష్ట్ర సాధనతో ఈ పండుగలు విశ్వ విఖ్యాతమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందో.. నాటి నుంచి ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా హరీశ్ గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మని రాష్ట్ర పండుగగా జరుపుకున్నామన్నారు.
ఏ దేశంలో ఉన్నా.. ఎక్కడున్నా తెలంగాణ వాళ్లు చాలా గొప్పగా ఈ బతుకమ్మ పండగను జరుపుకుంటారని వివరించారు. ఈ పండుగ వెనుక సైన్స్ కూడా ఉందన్నారు. కొత్తగా వచ్చిన వర్షపు నీటిలో కీటకాలు ఉంటాయని.. వాటిని శుభ్రం చేయటం కోసం తంగేడు, గునుగు పువ్వులను నీటిలో వేస్తారన్నారు. దీని వల్ల నీరు పరిశుభ్రమవుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని తాను ప్రార్థించానన్నారు. ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి.. మంత్రి ఆదేశాలివే
దారుణం.. విద్యార్థిని కాళ్లతో తన్నుతూ దాడి...
For More TG News And Telugu News