Junior Assaulted Tirupati: దారుణం.. విద్యార్థిని కాళ్లతో తన్నుతూ దాడి...
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:10 PM
మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు.
తిరుపతి జిల్లా, సెప్టెంబర్ 29: జిల్లాలోని నారాయణవనం సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ జూనియర్ విద్యార్థి పట్ల కిరాతకంగా ప్రవర్తించారు. సిద్ధార్థ కాలేజీలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. అంతేకాకుండా తామోదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్లుగా విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. కాగా... ఈ విషయం బయటపడటంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే ఓ యువతి ప్రేమ వ్యవహారంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
విషయం తెలిసిన వెంటనే బాధిత విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. గాయపడిన తమ బిడ్డను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మంచి భవిష్యత్ కోసం హాస్టల్‌లో ఉండి చదివిస్తుంటే తమ బిడ్డపై ఇంత దారుణంగా దాడికి పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడికి పాల్పడిన ఆరుగురు విద్యార్థులపై నారాయణవనం పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ల దాడిలో గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యం వెంటనే స్పందిస్తూ... సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకుంది. జూనియర్‌ను చితకబాదినందుక గాను వారిని సస్పెండ్ చేస్తూ కాలేజ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్
సీఐఐ సదస్సుకు ఎల్జీ సంస్థకు ప్రత్యేక ఆహ్వానం
Read Latest AP News And Telugu News